సర్వీస్ రివాల్వర్‎తో కాల్చుకుని సీనియర్ IPS ఆఫీసర్ ఆత్మహత్య

సర్వీస్ రివాల్వర్‎తో కాల్చుకుని సీనియర్ IPS ఆఫీసర్ ఆత్మహత్య

చండీగఢ్‌: హర్యానా రాజధాని చండీగఢ్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. హర్యానా కేడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ వై పురాణ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. మంగళవారం (అక్టోబర్ 7) తన నివాసంలోనే సర్వీస్ రివాల్వర్‎తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నారు. సిబ్బంది ద్వారా సమాచారం అందుకున్న చండీగఢ్ పోలీసులు, హర్యానా పోలీసు ఉన్నతాధికారులు హుటాహుటిన  సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పురాణ్ కుమార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‎మార్టానికి తరలించారు. 

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పురాణ్ సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఆయన మొబైల్ ఫోన్, ఇతర వస్తువులను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆత్మహత్యకు వ్యక్తిగత కారణాలా లేక మరేదైనా రీజన్ ఉందా అన్న కోణంలో విచారిస్తున్నారు. నిజాయితీ, నిబద్ధత గల ఆఫీసర్‎గా పురాణ్ కుమార్‎కు పోలీస్ శాఖలో పేరుంది. అలాంటి వ్యక్తి అకాల మరణం హర్యానా పోలీస్ శాఖను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

సీనియర్ ఐపీఎస్ అధికారి, అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) హోదాలో ఉన్న వై పురాణ్ కుమార్ గత కొన్ని సంవత్సరాలుగా హర్యానా పోలీస్ శాఖలో సేవలు అందిస్తున్నారు. ఆయన భార్య, ఐఏఎస్ అధికారిణి అమ్నీత్ పి కుమార్ కూడా హర్యానా కేడర్‎లోనే పని చేస్తున్నారు. వై పురాణ్ ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో విధుల్లో భాగంగా ఆమె విదేశీ పర్యటనలో ఉన్నారు. హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీతో పాటు జపాన్‌ పర్యటనకు వెళ్లారు. భర్త మరణించిన విషయం తెలుసుకున్న ఆమె వెంటనే ఇండియాకు రిటన్ అయ్యారు.