హర్యానా డిప్యూటీ సీఎం దుశ్యంత్ చౌతాలా కారుకు ప్రమాదం

హర్యానా డిప్యూటీ సీఎం దుశ్యంత్ చౌతాలా  కారుకు ప్రమాదం

ఢిల్లీ : హర్యానా డిప్యూటీ సీఎం దుశ్యంత్ చౌతాలా ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. దుశ్యంత్ చౌతాలాకు తృటిలో ప్రమాదం తప్పింది. హిసార్ నుండి సిర్సాకు వెళ్తుండగా మార్గ మధ్యలో దట్టమైన పొగమంచు కారణంగా డిప్యూటీ సీఎం కాన్వాయ్‌లో ప్రయాణిస్తున్న మరో పోలీసు వాహనాన్ని ఢీకొట్టింది. ఆగ్రోహా వద్ద నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది. 

ఈ ప్రమాదంలో డిప్యూటీ సీఎం చౌతాలా క్షేమంగా బయటపడగా,  ఓ పోలీసు అధికారికి గాయాలయ్యాయి. హిస్సార్ నుంచి సిర్సా వెళ్లే మార్గంలో అగ్రోహ మార్గంలో బీఎస్ఎఫ్ క్యాంపు దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది. అలాగే హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ కారు కూడా ప్రమాదానికి గురైంది. సోమవారం రాత్రి అంబాలా కాంట్ నుండి గురుగ్రామ్‌కు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కారు ఢీకొనడంతో తృటిలో తప్పించుకున్నారు.

పొగ మంచు కారణంగా ప్రమాదం.. ఒకరి మృతి

ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్‌లో జరిగిన మరో పొగ మంచు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించారు. దంకౌర్ జిల్లాలో బస్సు కంటైనర్ వాహనం ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరో పది మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. గత కొన్ని రోజులుగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. దట్టమైన పొగ మంచు ఆవరిస్తోంది. రోడ్డుపై వామనాలు కనిపించని పరిస్థితి ఏర్పడుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. 

యూపీ, పంజాబ్లకు కోల్డ్ వేవ్ అలర్ట్ 

ఉత్తరప్రదేశ్ తోపాటు పంజాబ్ రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ కోల్డ్ వేవ్ అలర్ట్ జారీ చేసింది. గత కొద్ది రోజులుగా దట్టమైన పొగ మంచు ఆవరిస్తూ ప్రమాదాలకు గురవుతున్న విషయం తెలిసిందే. చాలా చోట్ల టెంపరేచర్ 10 డిగ్రీల లోపే నమోదవుతోంది. ఢిల్లీ, అమృత్‌సర్, భటిండా, గంగానగర్, పాటియాలా, లక్నో, పూర్నియా. అంబాలా. ఆగ్రా, గోరఖ్‌పూర్, బరేలీ. పాట్నా, గయా, కోల్‌కతా వంటి ప్రాంతాల్లోనూ దట్టమైన పొగమంచు కమ్ముకునే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.