
చంఢీఘర్: హర్యానా కేడర్ ఐపీఎస్ అధికారి వై పురాన్ కుమార్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పురాన్ కుమార్ ఇంట్లో 8 పేజీల సూసైడ్ లెటర్ గుర్తించారు పోలీసులు. డీజీపీ, ఏడీజీపీ, ఎస్పీ ర్యాంకులకు చెందిన 10 మంది సీనియర్ అధికారులు మానసిక వేధింపులకు గురిచేశారని.. అందుకే ఆత్మహత్యకు పాల్పడ్డట్లు ఆయన లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. ఉన్నతాధికారులు, సహోద్యోగులు తనను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని అవమానించారని లేఖలో పురాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే.. పురాణ్ లేఖలో పేర్కొన్న ఉన్నతాధికారుల పేర్లను పోలీసులు వెల్లడించలేదు. ఇదిలా ఉంటే.. పురాణ్ ఆత్మహత్యకు మరో కారణం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తు్న్నారు. పురాన్ ఆత్మహత్యకు రెండు రోజుల ముందు ఆయన గన్‌మెన్ సుశీల్ కుమార్ అరెస్ట్ అయ్యాడు. ఓ మద్యం వ్యాపారి నుంచి లంచం డిమాండ్ చేసిన ఆరోపణలపై సుశీల్ కుమార్‌ను అరెస్ట్ చేసి విచారించారు పోలీసులు.
పురాణ్ కుమార్ ఆదేశం మేరకే తాను లంచం అడిగానని సుశీల్ పోలీసులు విచారణలో చెప్పాడు. దీంతో పురాణ్ కుమార్‌ను రోహ్తక్ రేంజ్ ఐజీ పదవి నుంచి సునారియాలోని పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ (పిటిసి)కి బదిలీ చేసింది ప్రభుత్వం. సుశీల్ కుమార్ కేసులో పురాణ్పై చర్యలకు కూడా పోలీసులు సిద్ధమవుతుండటంతో ఆయన తీవ్ర మానసిక ఆందోళనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.