ప్రైవేట్ జాబ్స్ లో 75% కోటా రాజ్యాంగ విరుద్ధం : హైకోర్టు

ప్రైవేట్ జాబ్స్ లో 75%  కోటా రాజ్యాంగ విరుద్ధం : హైకోర్టు

న్యూఢిల్లీ:  ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగాల్లో స్థానికులకు 75% రిజర్వేషన్లు కల్పిస్తూ హర్యానా ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు కొట్టేసింది. రాష్ట్ర ప్రభుత్వం 2020లో తెచ్చిన ‘హర్యానా స్టేట్ ఎంప్లాయ్ మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ యాక్ట్’ రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 19లకు విరుద్ధమని హైకోర్టు శుక్రవారం తన తీర్పులో తేల్చిచెప్పింది. అయితే, హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ కు వెళ్లాలని మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. 

హర్యానాలో రూ. 30 వేల కంటే తక్కువ జీతాలు ఉండే ప్రైవేట్ జాబ్స్ లో స్థానికులు లేదా శాశ్వత నివాస ధ్రువపత్రం ఉన్నవారికి 75% రిజర్వేషన్లు కల్పిస్తూ అక్కడి బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. బీజేపీ మిత్రపక్షమైన జన్ నాయక్ జనతా పార్టీ చీఫ్, డిప్యూటీ సీఎం దుష్యంత్ సింగ్ చౌతాలా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో స్థానికులు, ప్రధానంగా జాట్ వర్గం ప్రజలను ఆకర్షించేలా ఈ హామీని ఇచ్చారు.

దీనిని నెరవేర్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం బిల్లును రూపొందించి 2020 నవంబర్ లో అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించింది. గవర్నర్ 2021లో ఆమోదం తెలిపారు. హర్యానాలోకి వలసలు పెరుగుతుండటంతో స్థానికుల హక్కుల రక్షణ కోసం ఈ చట్టాన్ని తెచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది.