రూపాయి పతార నిజంగా తగ్గిందా ?

రూపాయి పతార నిజంగా తగ్గిందా ?

అంతర్జాతీయంగా క్రయ విక్రయాలు అన్నీ డాలర్​ మాధ్యమంగా జరిగేటట్లు, ప్రపంచ ఆర్థిక సంస్థలు నెలకొల్పే సమయంలో అన్ని దేశాలు అంగీకరించాయి. దాంతో ప్రపంచ క్రయ విక్రయాలు అన్నీ డాలర్​ మాధ్యమంతో సాగడం మొదలైంది. అనేక దేశాలు తమ వ్యాపారం ద్వారా డాలర్ల రూపేనా అంతర్జాతీయ ద్రవ్య నిలువలు పెంచుకున్నాయి. తద్వారా డాలర్​ విలువ హెచ్చుతగ్గులు ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక దేశాలపై ప్రభావం చూపుతున్నది. కాబట్టి డాలర్​ విలువ కాపాడుకోవడంలో కేవలం అమెరికా మాత్రమే కాకుండా డాలర్ల నిల్వలు అధికంగా ఉన్న చాలా దేశాలు సహజంగానే చర్యలు చేపడతాయి.

అమెరికా ఆర్థిక శక్తిగా ఉండటం, పెట్టుబడులకు కేంద్రంగా ఉండటం, అన్ని దేశాలతో చాలా వరకు బలమైన ఆర్థిక, వ్యాపార సంబంధాలు కలిగి ఉండటంతో డాలర్​ విలువ మార్పులు ప్రపంచ దేశాలపై అధికంగా ఉంది. అమెరికాలో ద్రవ్యోల్బణ సమస్య ప్రధానంగా ఉండటంతో ఫెడ్​ రిజర్వ్​వడ్డీ రేట్లను గణనీయంగా పెంచింది. దీంతో అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకుంటూ అమెరికా డిపాజిట్లపై ఆసక్తి కనబరుస్తుండటంతో డాలర్ల విలువ మరింత పెరుగుతున్నది. కరోనా, రష్యా–ఉక్రెయిన్​ యుద్ధం నేపథ్యంలో పెట్టుబడుదారులకు అమెరికా ఆర్థిక వ్యవస్థ ఒక బలమైన శక్తిగా కనపడటంతో పెట్టుబడుదారుల విశ్వాసాన్ని చూరగొంటున్నది. దీంతో ఇది దిగుమతులపైన వివిధ దేశాలకు పెద్ద భారంగా పరిణమిస్తున్నది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తు సేవల దిగుమతులు అన్నీ కూడా ప్రియం కావడంతో కరెంట్​అకౌంట్​డెఫిసిట్​ కూడా పెరుగుతూ వస్తున్నది.

రూపాయి పతనం భారం ఎవరికి..

పడిపోయిన రూపాయి విలువ భారం విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులపై ప్రత్యక్షంగా పడుతుంది. వివిధ రకాల వస్తు సేవలను దిగుమతి చేసుకుంటున్న వ్యాపార వర్గాలు, వినియోగదారులకు ఆర్థికంగా భారం పడుతుంది. భారత అంతర్జాతీయ చెల్లింపుల విషయంలోనూ భారం తప్పదు. ముఖ్యంగా క్రూడ్​ఆయిల్​ వంటివి పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటాం కాబట్టి వాటి ధరలపైన ప్రభావం ఉంటుంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్​ ఆయిల్​ధరలు తక్కువగా ఉండటంతో వాటి భారం ప్రజలపై కనిపించడం లేదు. కానీ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ​ఆయిల్​ధరలు పెరిగితే, ప్రజలకు పెద్ద భారంగా ఉంటుంది.

అంతర్జాతీయ మార్కెట్​లో అసాధారణంగా వచ్చే పరిస్థితులకనుగుణంగా దేశీయ కరెన్సీ విలువ మార్పులు, చేర్పులు సహజంగా జరిగే విషయం. కానీ దీర్ఘకాలంలో రూపాయి విలువను అంతర్జాతీయంగా పటిష్టం చేయాలంటే దేశీయ సంస్థల ఉత్పత్తి సామర్థ్యాన్ని, ఉత్పాదకతను పెంచే విధంగా పారిశ్రామిక సంస్థలకు, అంకుర పరిశ్రమలకు ప్రోత్సాహకరమైన పారిశ్రామిక విధానం అవలంబించాలి. స్పష్టమైన, ప్రణాళికబద్ధమైన విధానాలతోపాటు పురోగతిపై నిరంతరం సమీక్షలు జరిపి, అవసరమైన మార్పులు చేస్తే, దేశ పారిశ్రామిక ఆర్థిక ప్రగతి ముఖచిత్రంలో పురోగతి, స్వయం సమృద్ధికి అవకాశం ఉంటుంది.

విదేశీ మారక నిల్వలపై ప్రభావం

డాలర్​బలపడటం వల్ల నెలకొన్న అస్థిరతల మధ్య కరెన్సీ మార్కెట్ల డాలర్ల సప్లయ్​ని పెంచడానికి భారత రిజర్వ్​ బ్యాంకు డాలర్లను అంతర్జాతీయ మార్కెట్లో అమ్మకాలు చేస్తుంది. ఏప్రిల్​2022 నుంచి దాదాపు 35 బిలియన్​ డార్లను అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్లో అమ్మేసింది. ఈ అమ్మకాల ప్రభావం మన విదేశీ మారక నిల్వలపై పడింది. 2022 ప్రారంభంలో దేశ విదేశీ మారక నిల్వలు 633.6 బిలియన్​ డాలర్ల నుంచి 13.88 శాతం తగ్గి 545.6 బిలియన్​ డాలర్లకు పడిపోయాయి.

భారత్​ తర్వాత రష్యా ఫారెక్స్​నిల్వలు 10 శాతం, ఇండోనేషియావి 9 శాతం క్షీణించాయి.  కానీ తైవాన్​ విదేశీ నిల్వలు మాత్రం అత్యల్పంగా 0.53 శాతం మాత్రమే తగ్గాయి. తన చర్యలతో భారత రిజర్వ్​ బ్యాంకు రూపాయి మరింత పతనం కాకుండా కాపాడింది. రిజర్వు బ్యాంకు వడ్డీరేట్ల పెంపు, అధిక ద్రవ్యోల్బణం, రూపాయి విలువ మరింత పతనమైతే, అది విదేశీ నిల్వలపైన మరింత ప్రభావం చూపిస్తుంది. అయితే ఇప్పుడు ఉన్న విదేశీ మారక నిల్వలను బట్టి చూస్తే పెద్ద ఆర్థిక ప్రమాదం ఏమీ ఉండదు.

డాలర్​తో పోలిస్తే వివిధ దేశాల కరెన్సీ విలువ..

ప్రపంచ ఆర్థిక అగ్రగామి కరెన్సీ డాలర్ల విలువ అనేక దేశాలపైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నది. 2021 మే నుంచి వివిధ దేశాల కరెన్సీ విలువను డాలర్​తో పోల్చి పరిశీలించినప్పుడు యూరోపియన్ యూనియన్​‘యూరో’ కరెన్సీ 19 శాతం, బ్రిటీష్​‘ఫౌండ్’ 20 శాతం, జపనీస్​‘యెన్’ 28 శాతం, పడిపోయాయి. భారతదేశం రూపాయి 8 శాతం వరకే క్షీణించింది. ఈ దేశాల కరెన్సీ విలువల పతనానికి కారణం డాలర్​ విలువ పెంచే విధంగా ఫెడ్​ రిజర్వ్​ చేపట్టిన ద్రవ్య విధానాలే. అమెరికా ఎదుర్కొంటున్న ద్రవ్యోల్బణ పరిస్థితి నుంచి బయటపడటానికి పెంచిన వడ్డీ రేట్లు, ఆర్థిక స్థిరత్వం డాలర్​ విలువ ఎగబాకడానికి ముఖ్య కారణంగా మారాయి.

డాలర్ల విలువ గణనీయంగా పెరగడాన్ని గతంలో కూడా చూడవచ్చు. 1980–1985 మధ్యకాలంలో డాలర్​ దాదాపు 47 శాతం పెరిగింది. 2002లో కూడా ప్రపంచ దేశాలు అలాంటి పరిస్థితినే చూశాయి. 1980–85 కాలంలో డాలర్​ విలువ పెరుగుదల ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి ‘ప్లాజా ఆకార్డ్” ద్వారా అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్​లో అమెరికా, మిగతా ముఖ్యమైన దేశాలతో ఒప్పందాలు చేసుకోవడం లాంటి దిద్దుబాటు చర్యలు జరిగాయి. కానీ నేటి పరిస్థితి కొంత భిన్నమైంది. అమెరికా డాలర్​ విలువ పటిష్టంగానే ఉంటుంది. ఈ సమస్యకు ప్రపంచ దేశాలు ఆర్థికంగా ఉన్నత స్థితి చేరుకోవాలంటే వస్తు సేవల ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచుకోవటం ద్వారా అంతర్జాతీయ మార్కెట్​లో వారి కరెన్సీ విలువ బలంగా మారడానికి ఆస్కారం ఉంటుంది.

ఇండియా ఎటువైపు..

ప్రపంచ ఆర్థిక సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో కూడా భారతదేశంలో ఫారెన్​పోర్ట్​పోలియో ఇన్వెస్ట్​మెంట్స్​గణనీయంగా రావడం హర్షించదగిన పరిణామం. దీనికి తోడు అంతర్జాతీయ ద్రవ్య నిల్వలు కూడా బలంగా ఉండటం దేశ ఆర్థిక పటిష్టతను తెలియజేస్తున్నది. నేడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల వృద్ధిరేటు కోతలను, కరెన్సీ విలువల పతనాన్ని పరిశీలించినప్పుడు భారత ఆర్థికవ్యవస్థ ఎంతో మెరుగ్గా ఉందని చెప్పడంలో అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఎప్పుడైనా భారీ ఆర్థిక సంక్షోభాన్ని, అంతర్జాతీయ, ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థలు ఒడిదొడుకులను ఎదుర్కోవడం సహజం. ఆర్థికంగా బలీయమైన దేశాలకు ఒత్తిడులను తట్టుకునే ఆర్థిక శక్తి సహజంగానే ఉంటుందని మనం గమనించాలి.

భారత దేశం ప్రపంచ ఆర్థిక విపణిలో పోటీపడటం కోసం అనేక సంస్కరణలు దశల వారీగా వివిధ రంగాల్లో తెస్తూ కీలక మార్పులు చేస్తున్నది. వ్యాపార సరళీకరణ చేయడం, జవాబుదారితనం పెంచడం, అవినీతిని కనిష్ట స్థాయికి తీసుకువెళ్లడం, రాజకీయ స్థిరత్వం లాంటి అంశాలు భారతదేశానికి కలిసి వచ్చేవి. కానీ జనాభాకు అవసరమైన నైపుణ్యాల శిక్షణ వేగవంతం చేయాలి. జనాభా పెరుగుదలకు అడ్డుకట్ట వేసే విధంగా చర్యలు చేపట్టాలి. పరిపాలనలో మరింత జవాబుదారితనం, సరళీకరణ విధానాలు, అవస్థాపన సౌకర్యాలు, విద్య, వైద్యం లాంటివి నాణ్యంగా అందించగలిగితే భారతదేశం మరింత వేగంగా, బలమైన శక్తిగా ఎదిగే అవకాశం ఉంటుంది.

- డా.చిట్టెడి కృష్ణారెడ్డి, సెంట్రల్​ యూనివర్సిటీ, హైదరాబాద్