హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్ ప్రొవిజన్లు రూ.14,442 కోట్లు

హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్ ప్రొవిజన్లు రూ.14,442 కోట్లు
  • కిందటేడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో రూ.2,602 కోట్లే
  • భవిష్యత్‌‌‌‌లో మొండిబాకీలు పెరిగే ఛాన్స్ ఉందనే సిగ్నల్స్‌‌‌‌
  • 1.31 శాతం తగ్గి రూ.16,258 కోట్లకు చేరిన బ్యాంక్  నికర లాభం

న్యూఢిల్లీ: అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్ ఈ ఏడాది జూన్‌‌‌‌తో ముగిసిన క్వార్టర్‌‌‌‌‌‌‌‌ (క్యూ1) లో ప్రొవిజన్ల కోసం రూ.14,442 కోట్లను పక్కన పెట్టింది. కిందటేడాది  జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో కేటాయించిన రూ.2,602 కోట్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఇందులో  ప్లోటింగ్‌‌‌‌ ప్రొవిజన్ల విలువ రూ.9 వేల కోట్లుగా ఉంది. అంటే  భవిష్యత్‌‌‌‌లో ఎదురయ్యే మొండిబాకీలను ఎదుర్కోవడానికి ఈ ప్రొవిజన్‌‌‌‌ కింద అమౌంట్‌‌‌‌ను పక్కన పెడతారు. 

ఒక్క అకౌంట్ కోసం స్పెసిఫిక్‌‌‌‌గా కేటాయించారు.  బ్యాంక్ ప్రొవిజన్లు పెరగడంతో లాభం తగ్గింది. హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్‌‌‌‌కు కిందటేడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో రూ.16,475 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్‌‌‌‌) రాగా, ఈ ఏడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో ఈ నెంబర్ 1.3 శాతం తగ్గి  రూ. 16,258 కోట్లకు పడింది.  

అనుబంధ సంస్థ హెచ్‌‌‌‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓ నుంచి  రూ.9,128 కోట్ల వన్‌‌‌‌టైమ్‌‌‌‌  ప్రాఫిట్ కూడా పొందింది.   హెచ్‌‌‌‌డీబీ ఫైనాన్షియల్ ఐపీఓ  తర్వాత ఈ కంపెనీలో  బ్యాంక్ వాటా 94.32శాతం నుంచి 74.19శాతానికి  దిగొచ్చింది.

పెరిగిన వడ్డీ ఆదాయం..

బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం కిందటేడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే ఈ ఏడాది క్యూ1 లో  5.4 వృద్ధి చెంది రూ.31,438 కోట్లకు చేరుకుంది. కానీ,  నికర వడ్డీ మార్జిన్ (ఎన్‌‌‌‌ఐఎం) మాత్రం 3.46 శాతం నుంచి 3.35 శాతానికి తగ్గింది. 

బ్యాంక్  ఆపరేటింగ్ ఖర్చులు 4.9 శాతం పెరిగి రూ.17,434 కోట్లకు చేరుకున్నాయి. బ్యాంక్   మొత్తం స్టాండలోన్ ఆదాయం రూ.99,200 కోట్లుగా నమోదైంది.  గ్రాస్ అడ్వాన్స్‌‌‌‌లు (ఇచ్చిన అప్పులు)  6.7శాతం పెరిగి రూ.26.53 లక్షల కోట్లకు, డిపాజిట్లు 16.2శాతం పెరిగి రూ.27.64 లక్షల కోట్లకు ఎగిశాయి. ఈ ఏడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే  బ్యాంక్ గ్రాస్ ఎన్‌‌‌‌పీఏ రేషియో 1.33 శాతం నుంచి 1.40 శాతానికి పెరిగింది.  నెట్ ఎన్‌‌‌‌పీఏ రేషియో  0.47 శాతం దగ్గర ఉంది. 

షేరుకి రూ.5 డివిడెండ్‌‌‌‌..

బ్యాంక్ బోర్డు షేరుకి రూ.5  చొప్పున  ప్రత్యేక మధ్యంతర డివిడెండ్‌‌‌‌ ఇవ్వాలని,  1:1 బోనస్ (ఒక షేరుకి ఒక షేరు) ఇష్యూ చేయాలని నిర్ణయించింది.  డివిడెండ్ చెల్లింపునకు ఈ ఏడాది ఆగస్టు 11, బోనస్‌‌‌‌కు ఆగస్టు 27 రికార్డ్ డేట్‌‌‌‌లు. బ్యాంక్ షేర్లు శుక్రవారం 1.57 శాతం తగ్గి రూ.1,956 వద్ద ముగిశాయి.