రెండో త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నికర లాభం 10,605కోట్లు

రెండో త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నికర లాభం 10,605కోట్లు
  • క్యూ2లో రూ. 10,605.8 కోట్ల లాభం
  • వడ్డీ ఆదాయం రూ. 21,021.2 కోట్లు

న్యూఢిల్లీ:  హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌తో ముగిసిన క్వార్టర్‌‌ (క్యూ2) ‌‌లో అదిరిపోయే పెర్ఫార్మెన్స్ చేసింది. బ్యాంక్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 20.1 % పెరిగి రూ.10,605.8 కోట్లకు  చేరుకుంది. కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌లో రూ. 8,834.3 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. సెప్టెంబర్ క్వార్టర్‌‌, 2021 ‌‌లో బ్యాంక్‌‌కు రూ.17,684 కోట్ల  వడ్డీ ఆదాయం (ఎన్‌‌ఐఐ) రాగా, ఈ ఏడాది క్యూ2 లో ఇది 19 % పెరిగి రూ.21,021.2 కోట్లకు చేరుకుంది.

బ్యాంక్  అడ్వాన్స్‌‌లు  ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి  రూ.14.4 లక్షల కోట్లకు పెరిగాయి. ఏడాది ప్రాతిపదికన ఇది 23.4 %  పెరుగుదల.  బ్యాంక్ బ్యాలెన్స్ షీటు రూ.18.4 లక్షల కోట్ల నుంచి రూ.22.3 లక్షల కోట్లకు పెరుగుతూ 21 % గ్రోత్‌‌ను నమోదు చేసింది.ఏడాది ప్రాతిపదికన లోకల్‌‌ మార్కెట్‌‌లో బ్యాంక్ ఇచ్చిన రిటైల్‌‌ లోన్లు క్యూ2 లో21.4 % పెరిగాయి.

కమర్షియల్‌‌, రూరల్ బ్యాంకింగ్‌‌ లోన్లు 31.3 %, కార్పొరేట్‌‌, హోల్‌‌సేల్ లోన్లు 27 శాతం ఎగిశాయి.  మార్కెట్‌‌లో లిక్విడిటీ తగ్గిపోతున్నప్పటికీ హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ డిపాజిట్లు పెరగడాన్ని గమనించాలి. బ్యాంక్ డిపాజిట్లు  కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌తో పోలిస్తే  19 % వృద్ధి సాధించి రూ. 16.73 లక్షల కోట్లకు చేరుకున్నాయి.  హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్‌‌ (కాసా) డిపాజిట్లు 15.4 %  పెరిగాయి. ఇందులో సేవింగ్స్ అకౌంట్‌‌లోని డిపాజిట్లు రూ.5.30 లక్షల కోట్లుగా, కరెంట్‌‌ అకౌంట్‌‌లలోని డిపాజిట్లు రూ.2.3 లక్షల కోట్లుగా ఉన్నాయి. 

ప్రొవిజన్లు తగ్గాయ్‌‌

బ్యాంక్ మొండి బాకీలు (ఎన్‌‌పీఏలు) క్యూ2 లో మెరుగుపడ్డాయి. గ్రాస్ అడ్వాన్స్‌‌లలో గ్రాస్ ఎన్‌‌పీఏల వాటా 1.23 శాతానికి మెరుగుపడింది.  కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌లో ఇది 1.35 శాతంగా రికార్డయ్యింది. బ్యాంక్ నెట్‌‌ ఎన్‌‌పీఏల రేషియో 0.33 శాతంగా రికార్డయ్యింది. బ్యాంక్ క్యూ2 లో మొండిబాకీల కోసం కేటాయించిన  ప్రొవిజన్లు, కాంటెంజెన్సీలు రూ.3,924.7 కోట్ల నుంచి  రూ.3,240.1 కోట్లకు తగ్గాయి.