టఫ్ మ్యాచ్‌‌ల్లో ఎలా ఆడాలో కోహ్లీకి తెలుసు

టఫ్ మ్యాచ్‌‌ల్లో ఎలా ఆడాలో కోహ్లీకి తెలుసు

వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్స్‌‌లో న్యూజిలాండ్‌తో తలపడేందుకు టీమిండియా సన్నద్ధమవుతోంది. అన్ని రకాలుగా కివీస్‌ను ఢీకొట్టేందుకు భారత్ రెడీ అవుతోంది. అయితే జట్టును ముందుండి నడిపించాల్సిన సారథి విరాట్ కోహ్లి టెస్టుల్లో ఫామ్ లేమి టీమ్‌ను భయపెడుతోంది. ఏడాదిన్నరలో విరాట్ ఒక్క సెంచరీ కూడా చేయకపోవడం గమనార్హం. చివరగా 2019లో బంగ్లాదేశ్‌తో కోల్‌కతాలో జరిగిన డే అండ్ నైట్ టెస్టులో సెంచరీ బాదిన ఈ పరుగుల యంత్రం బ్యాట్ నుంచి మరో శతకం ఇప్పటివరకూ రాలేదు. అయితే అత్యంత ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో కింగ్ కోహ్లి విజ‌ృంభిస్తే అది జట్టుకు మరింత ప్రయోజనం చేకూర్చి ట్రోఫీని ఒడిసి పట్టడానికి అవకాశం కల్పిస్తుంది. కాబట్టి కోహ్లి రాణించాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ విషయంపై పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ రమీజ్ రాజా స్పందించాడు. ఇలాంటి టఫ్ మ్యాచుల్లో ఎలా రాణించాలో, ఏం చేయాలనేది కోహ్లీకి పూర్తి క్లారిటీ ఉంటుందని రమీజ్ చెప్పాడు. 

‘కొందరు ఆటగాళ్లు ఎక్కువగా ఆలోచిస్తూ తమను తాము ఒత్తిడిలో నెట్టేసుకుంటారు. దీని వల్ల పరుగులు, సెంచరీలు చేయలేకపోతారు. కానీ కోహ్లి అలా కాదు. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కోహ్లి రాణిస్తాడని నమ్ముతున్నా. కనీసం 20 నుంచి 25 కోహ్లి క్రీజులో నిలుచొని, తన మోచేతితో బాగా షాట్లు ఆడగలిగితే కచ్చితంగా అతడు భారీగా పరుగులు చేస్తాడు’ అని రమీజ్ రాజా సూచించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత్ ఆడుతుండటంతో ఈ మ్యాచ్‌పై మంచి అంచనాలు ఏర్పడ్డాయన్నాడు.