హైదరాబాద్, వెలుగు: హైకోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తమని మోసాలు చేస్తున్న ఇద్దరిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఫేక్ నోటిఫికేషన్, సర్క్యులర్స్‌తో 162 మంది నుంచి రూ. 3 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించారు. ఇదే కేసులో గత మంగళవారం ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
గవర్నమెంట్ టీచర్.. జాబ్ ఫ్రాడ్
జనగామ జిల్లా తమ్మడపల్లి గ్రామానికి చెందిన తిరునహరి విష్ణుమూర్తి(55) గవర్నమెంట్ సోషల్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. హన్మకొండలోని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్ నిర్వాహకుడు తాళ్లపల్లి సంజయ్‌కుమార్ (42), నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన చిన్నగల దశరథ్ (46), హైదరాబాద్ డబీర్‌పురలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నైట్ వాచ్‌మన్ కొట్మిర్‌కర్ మహావీర్(42)తో కలిసి నిరుద్యోగ యువతను ట్రాప్ చేశాడు. హైకోర్టు రిజిస్టర్ జనరల్, సీనియర్ ఇన్‌చార్జ్ ఫోర్జరీ సంతకాలతో ఫేక్ నోటిఫికేషన్స్, సర్క్యులర్స్ క్రియేట్ చేశారు.
హైకోర్టు రిజిస్ట్రార్ సైన్ ఫోర్జరీ చేశారు
హైకోర్టులో జూనియర్ అసిస్టెంట్స్, అటెండర్స్, డ్రైవర్స్, మినిస్టీరియల్ స్టాఫ్ పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తామని వీళ్లు నమ్మించారు. ఒక్కో వ్యక్తి నుంచి రూ. లక్ష నుంచి రూ. 3 లక్షల వరకు వసూలు చేశారు. ఇలా 162 మంది నుంచి రూ. 3 కోట్లు కొల్లగొట్టారు. బాధితులు, హైకోర్టు రిజిస్టర్ జనరల్ ఇచ్చిన ఫిర్యాదుతో సీసీఎస్ పోలీసులు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేశారు. సంజయ్‌కుమార్, దశరథ్‌లను గత మంగళవారం అరెస్టు చేశారు. పరారీలో ఉన్న విష్ణుమూర్తి, మహావీర్‌లను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు.
