కాంగ్రెస్​ వస్తే కరెంట్​ కాటకలుస్తది.. మన పరిస్థితి మొదటికొస్తది : కేసీఆర్​

కాంగ్రెస్​ వస్తే కరెంట్​ కాటకలుస్తది.. మన పరిస్థితి మొదటికొస్తది : కేసీఆర్​
  • ఆ పార్టీ అధ్యక్షుడు కడుపుల మాట కక్కిండు
  • ఎవుసానికి 3 గంటల కరెంటు సరిపోతదా?
  • రైతు బంధుకు రాంరాం.. దళితబంధుకు జైభీమ్ చెప్తరు
  • పాలమూరును సస్యశ్యామలం చేస్తున్నం.. జడ్చర్ల సభలో సీఎం కామెంట్స్

మహబూబ్​నగర్, వెలుగు:  రాష్ట్రంలో పొరపాటున కాంగ్రెస్​ గెలిస్తే రైతుబంధుకు రాంరాం.. దళితుబంధుకు జైభీమ్​.. కరెంటు కాటకలుస్తది.. మన పరిస్థితి మొదటికొస్తది” అని  సీఎం కేసీఆర్​ అన్నారు. బుధవారం మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్లలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్​ మేనిఫెస్టో చూసి కొందరు ఆగమైతున్నారన్నారు. తెలంగాణలో రైతుల బతుకులు మార్చాలని ‘రైతుబంధు’ తీసుకొచ్చానని, నెత్తిమాసినోడొచ్చి ఈ స్కీం గురించి అడ్డంగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. 

తెలంగాణ రాక ముందు కరెంటు మోటార్లు, ట్రాన్స్​ఫార్మర్లు పటాకుల్లెక్క  కాలిపోయేటివని, వేలకు వేలు  ఖర్చు పెట్టుకొని రిపేర్లు చేయించేటోళ్లన్నారు. ఆ బాధలన్నీ తెలుసు కాబట్టే జిద్దుతోని రైతుబంధు ప్రవేశపెట్టామన్నారు. రూ.37 వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేశామని, పదేండ్లు కష్టపడితే తెలంగాణ రైతులు దేశంలోనే గొప్ప రైతులుగా మారే పరిస్థితి వస్తోందన్నారు.

వాళ్లు వస్తే కరెంటు కష్టాలు గ్యారంటీ

‘కొద్ది రోజుల కింద కర్నాటకలో కాంగ్రెస్ గెలిచింది. ఎన్నికలకు ముందు రైతులకు 20 గంటల కరెంట్ ఇస్తమని  చెప్పిండ్రు. 20 గంటలు కాదు.. ఐదు గంటలిస్తం సరిపెట్టుకోండని నిన్న కర్నాటక సీఎం ప్రకటన చేసిండు. ఇయ్యాల పీసీసీ అధ్యక్షుడు కడుపుల మాట కక్కిండు. రైతులకు కేసీఆర్​ వేస్ట్​గా 24 గంటలు కరెంటు ఇస్తుండు. మూడు గంటలు ఇస్తే చాలని అంటున్నడు’ అని ఫైర్​ అయ్యారు. కాంగ్రెస్​వస్తే  గ్యారంటీగా కరెంటును ఆగం పట్టిస్తరన్నారు.దేశంలో వ్యవసాయానికి 24 గంటలు కరెంటు ఇస్తున్న  రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని సీఎం కేసీఆర్​ తెలిపారు. ప్రధాని సొంత రాష్ట్రంలో  కూడా 24 గంటలు లేదని, అక్కడ రైతులు రోడ్ల మీదకొచ్చి గడ్​బడ్ ​చేస్తున్నారని చెప్పారు.

జూరాల నుంచి పాలమూరు సాధ్యమా?

పాలమూరు నుంచే కృష్ణానది పారుతున్నా నీళ్లు తీసుకోలేదని, గతంలో ఉన్న సీఎంలు జిల్లాకు ఏ లాభం చేయలేదని, ఉద్యమకాలంలో కృష్ణా జలాల్లో మన హక్కు ఎలా సాధించాలన్న విషయంలో  పరిశోధనలు చేశామని సీఎం కేసీఆర్​ తెలిపారు. అప్పుడే పాలమూరు స్కీం ప్రతిపాదిస్తే అప్పటి కాంగ్రెస్ సీఎంలు, ఆ పార్టీ దద్దమ్మ ఎమ్మెల్యేలు నోరు తెరిచి అడగలేక ఆగం పట్టించారన్నారు. తొమ్మిది టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉండే జూరాల ప్రాజెక్టు నుంచి పాలమూరు స్కీంకు నీటిని తీసుకునేలా డిజైన్​ చేసి గోల్​మాల్​ చేశారని గుర్తు చేశారు. జూరాల నుంచి నీళ్లు తోడితే మూడు రోజుల్లో ఖాళీ అవుతుందని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీశైలం సోర్స్ గా స్కీంను డిజైన్ చేశామన్నారు.

 జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలకు పేరువస్తదని కొందరు కాంగ్రెసోళ్లు గతంలో కేసులు వేసి స్కీమ్​ను అడ్డుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు.   నార్లాపూర్, ఎదుల, వట్టెం, కర్వెన, ఉదండాపూర్​ రిజర్వాయర్లు, టన్నెల్స్ పూర్తి చేశామన్నారు. మోటార్లు బిగించాల్సి ఉందన్నారు. దాదాపు ఈ స్కీం కింద 90 శాతం పనులు పూర్తయ్యాయని, మూడు నెలల్లో ఈ రిజర్వాయర్లు అందుబాటులోకి వస్తాయన్నారు. ఒక్క జడ్చర్ల నియోజకవర్గంలోనే ఉదండాపూర్ ​రిజర్వాయర్ ​ద్వారా1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని కేసీఆర్ ​చెప్పారు.

పోరాడి తెలంగాణ తెచ్చుకున్నం

చిన్న పొరపాటు వల్ల1956లో తెలంగాణను ఏపీలో కలిపారని, ఆ తప్పిదం వల్ల 60 ఏండ్లు గోస పడ్డామని, పాలమూరులో గంజి కేంద్రాలు తెరిచే పరిస్థితి వచ్చిందని కేసీఆర్​అన్నారు. బొంబాయి వలసలకు పాలమూరు కేంద్రమైందని, లంబాడీలు హైదరాబాద్​కు పోయి బతికారన్నారు. ఇదేనా మన జీవితమని పిడికిలెత్తి పోరాడితే తెలంగాణ వచ్చిందన్నారు.   తెలంగాణను ఎవరూ పుణ్యానికి ఇవ్వలేదని, వందల మంది బలిదానాలతో పాటు తాను చావు నోట్లో తల పెట్టి తెలంగాణ తెచ్చుకున్నట్లు గుర్తు చేశారు. 

తెలంగాణలో కులమతాలకు అతీతంగా అందరినీ సమానంగా చూస్తున్నామన్నారు. సభలో మంత్రి శ్రీనివాస్​గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్​రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూదనచారి, దేశపతి శ్రీనివాస్​, చల్లా వెంకట్రామిరెడ్డి, జడ్పీ చైర్​పర్సన్​ స్వర్ణా సుధాకర్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.