వినమ్రంగా ఎలా ఉండాలో ఆయనే నేర్పారు

వినమ్రంగా ఎలా ఉండాలో ఆయనే నేర్పారు

గౌహతి: అస్సాం మాజీ సీఎం తరుణ్ గొగోయ్ తనకు గురువు లాంటి వారని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. తరుణ్ గొగోయ్ (86) సోమవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. గొగోయ్‌‌ను గుర్తు చేసుకుంటూ రాహుల్ పలు ట్వీట్లు చేశారు. వినయంగా ఎలా ఉండాలో కేవలం 5 నిమిషాల్లో గొగోయ్ తనకు నేర్పారని రాహుల్ తెలిపారు. ఆయనను కోల్పోవడం చాలా బాధగా ఉందన్నారు.

‘తరుణ్ గొగోయ్ నాకు గురువు, టీచర్ లాంటి వారు. అస్సాం ఏంటనే దాని గురించి మరెవ్వరూ చెప్పలేని విధంగా ఆయన నాకు వివరించారు. గౌరవ్ ఆయన సొంత కొడుకు. కానీ ఆయన నన్ను తన సొంత కొడుకుగా చూసుకున్నారు. ఆయనతో మాట్లాడేటప్పుడు నేనో మనిషితో కాకుండా ఒక రాష్ట్రంతో సంభాషిస్తున్నట్లుగా అనిపించేది. తరుణ్ గొగోయ్ నిజమైన కాంగ్రెస్ నేత. అస్సాంలోని అన్ని కమ్యూనిటీలకు చెందిన ప్రజలు ఏకతాటిపైకి వచ్చేందుకు ఆయన తన జీవితాన్ని త్యాగం చేశారు. నా వరకు ఆయనో గొప్ప, జ్ఞానవంతులైన టీచర్. ఆయనపై నాకు ఎనలేని ప్రేమ, గౌరవం ఉన్నాయి. ఆయనను నేను మిస్సవుతా. తరుణ్ గొగోయ్‌‌తోపాటు అహ్మద్ పటేల్‌‌ను కూడా మేం పోగొట్టుకున్నాం. కాంగ్రెస్ పార్టీకి వాళ్లిద్దరూ రెండు స్తంభాల లాంటి వారు. ఇది కాంగ్రెస్‌‌ పార్టీకి దుర్దినం’ అని రాహుల్ పేర్కొన్నారు.