అతనిది మన దేశం కాదు. మన భాష రాదు.అతను ఇంటర్నేషనల్ సెలబ్రిటీ అంతకన్నా కాదు. ఆఫ్రికా ఖండంలో ఒక మారుమూల ప్రాంతంలో ఆవులు కాస్తూ బతుకుతుంటాడు. పేరు కిలీ పాల్. ఇతనికి మన దేశంలో కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఎందుకంటే.. ఆయనకు మన భాష రాకపోయినా బాలీవుడ్ పాటలకు లిప్ సింక్ చేస్తూ... డాన్స్ చేస్తుంటాడు. ఆ వీడియోలను యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేస్తుంటాడు. ఆ ఫాలోయింగే ఇదంతా.
కిలీ పాల్ టాంజానియా దేశానికి చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. 2016లో యూట్యూబ్ జర్నీ మొదలుపెట్టిన కిలీ 2021నుంచి బాలీవుడ్ పాటలకు డాన్స్ చేస్తూ వీడియోలు చేస్తున్నాడు. అతనే కాదు.. అతని చెల్లెలు నీమాపాల్ కూడా అతనితోపాటు లిప్-సింక్ చేస్తూ డాన్స్ చేస్తుంటుంది. ఇప్పుడు అతనికి బాలీవుడ్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు.
కిలీ పాల్ 9 అక్టోబర్ 1995న తూర్పు ఆఫ్రికాలోని టాంజానియాలోని మిండు తులియన్ అనే ప్రాంతంలో పుట్టాడు. మాసాయి అనే గిరిజన తెగ వాళ్లది. కుటుంబంతో కలిసి సొంత ఊళ్లోనే ఉంటున్నాడు. కిలీకి ముగ్గురు తోబుట్టువులు ఉన్నారు. వాళ్లలో ఒకరైన నీమా పాల్ కూడా కిలీతోపాటు వీడియోలు చేసి పాపులర్ అయ్యింది. .
ఏం చేస్తాడు?
కిలీ వ్యవసాయం చేస్తుంటాడు. గొర్రెలు, మేకలు, ఆవులను మేపడానికి రోజూ అడవులకు వెళ్తాడు. ఇంత ఫాలోయింగ్ వచ్చాక కూడా ఒక పక్క వ్యవసాయపనులు చేస్తూనే మరో వైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నాడు. వీళ్ల ఊళ్లో కరెంట్ సౌకర్యం ఉండదు. ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టుకోవాలంటే కిలోమీటరు దూరం నడిచి వెళ్లి మరో ఊళ్లో పెట్టుకోవాలి. కిలీ తన సొంతూరులో నాలుగో తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత పక్క ఊళ్లో ఏడో తరగతి వరకు చదివాడు. కుటుంబ పరిస్థితుల వల్ల అక్కడితో చదువు ఆపేయాల్సి వచ్చింది.
మోడలింగ్ అంటే ఇష్టం
కిలీ పాల్కి చిన్నప్పటి నుండి యాక్టింగ్, మోడలింగ్ అంటే ఇష్టం. అందుకే ఎప్పుడూ ఏదో ఒకటి చేయాలని తపన పడేవాడు. వాళ్ల దగ్గర హిందీ సినిమాలు ఎక్కువగా రిలీజ్ అయ్యేవి. దాంతో బాలీవుడ్ సినిమాలు చూడడం, పాటలు వినడం అలవాటుగా మారింది. హిందీ పాటలు పలకడం నేర్చుకోవడానికి యూట్యూబ్, గూగుల్ సాయం తీసుకుంటాడు. ఒక్కో పాట లిప్ సింక్ కోసం కొన్ని గంటల తరబడి ప్రాక్టీస్ చేస్తాడు. ఇదంతా చూసి ఇంట్లో, చుట్టుపక్కల వాళ్లు నవ్వేవాళ్లు.
ముందు టిక్‌టాక్
కిలీ ఫేమస్ అవ్వడానికి ముందు టిక్‌టాక్‌లో వీడియోలు చేశాడు. గొర్రెలు, మేకలు మేపడానికి వెళ్ళినప్పుడు వాళ్ల సంప్రదాయ దుస్తుల్లో హిందీ, ఇంగ్లిష్‌లో వీడియోలు చేసేవాడు. కానీ.. అవి అంతగా రీచ్ కాలేదు. తర్వాత 2021లో ఇండియాలో టిక్ టాక్ బ్యాన్ అయ్యింది. దాంతో తన వీడియోలు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో అప్లోడ్ చేశాడు. కిలీ పాల్ అనే ఛానెల్‌ని 2016లోనే మొదలుపెట్టినప్పటికీ టిక్‌టాక్ బ్యాన్ తర్వాతే ఆ ఛానెల్లో వీడియోలు అప్లోడ్ చేశాడు. ఇప్పుడు కూడా ఈ ఛానెల్లో షార్ట్ వీడియోలే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఛానెల్‌కు 2.82 మిలియన్ల సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. ఒకసారి తన చెల్లెలు నిమా పాల్‌తో కలిసి సిద్ధార్థ్ మల్హోత్రా సినిమా ‘షేర్ షా’ లోని రతన్ లంబియా పాటపై లిప్‌సింక్ చేస్తూ డాన్స్ చేశాడు. ఆ పాటతో ఇండియాలో రాత్రికి రాత్రే ఫేమస్ అయ్యారు. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది.
బ్రాండ్ ప్రమోషన్లు
కిలీకి ఫాలోయింగ్ వల్ల అతనికి బ్రాండ్ ప్రమోషన్ చేసే అవకాశాలు కూడా వస్తున్నాయి. టాంజానియాలోని కొన్ని కంపెనీలు అతనితో బ్రాండ్ ప్రమోషన్ చేయించుకుంటున్నాయి. కిలీ ఆస్తి ప్రస్తుతం 20 నుండి 25 లక్షల రూపాయల వరకు ఉండొచ్చు. ప్రస్తుతం ప్రతి నెలా 2 నుంచి 3 లక్షల రూపాయల వరకు ఛానెల్ ద్వారా వస్తోంది. బ్రాండ్ ప్రమోషన్ల ద్వారా ఇంకొంత సంపాదిస్తున్నాడు.
ఇండియాకు కూడా వచ్చాడు
పోయినేడాది సెప్టెంబర్‌లో ఇండియాలో జరిగిన మెటా క్రియేటర్ డేకు కిలీకి ఆహ్వానం అందింది. ఆ ఈవెంట్లో బాలీవుడ్ యాక్టర్ రణవీర్ సింగ్‌తో కలిసి డాన్స్ చేశాడు. ఆ తర్వాత ఆక్టోబర్‌లో కూడా కిలీ బిగ్ బాస్ -16 షోకు గెస్ట్‌గా వచ్చాడు. షోలో ‘‘తు చీజ్ బడీ హై మస్త్’’ పాటకు పార్టిసిపెంట్స్‌తో కలిసి డాన్స్ చేశాడు. అప్పుడే అతను టీవీ డాన్స్ షో ‘‘ఝలక్ దికలాజా-10’’కి గెస్ట్‌గా వెళ్లాడు. షోలో మాధురీ దీక్షిత్‌తో కలిసి ‘‘చానే కే ఖేత్ మే” పాటకు పాదం కలిపాడు. అప్పుడే ఇండియాలో కొన్ని షార్ట్ వీడియోలు చేశాడు. ఇదొక్కటే కాదు.. అతనికి మరో అరుదైన గౌరవం కూడా దక్కింది. ఇండియాలో కిలీకి పెరుగుతున్న ఫాలోయింగ్ చూసి పోయినేడాది కిలీ పాల్‌ను టాంజానియాలోని ఇండియన్ కమిషన్ సత్కరించింది.