
మెదక్ టౌన్, వెలుగు: మెదక్ లో శుక్రవారం గుండెపోటుతో ఓ హెడ్ కానిస్టేబుల్ చనిపోయాడు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం..టౌన్‌లోని ఇందిరాపురి కాలనీలో ఉంటూ స్థానిక పీఎస్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేసే భీమన్నగారి యాదగిరి (53) గురువారం సాయంత్రం డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చాడు. పానం బాగా లేదని కుటుంబసభ్యులకు చెప్పాడు. చెమటలు వస్తుండడం, ఛాతిలో నొప్పి రావడంతో పట్టణంలోని ఓ ప్రైవేట్దవాఖానకు తరలించారు.
గుండెపోటు వచ్చిందని చెప్పిన డాక్టర్లు..కండీషన్ బాగా లేదని హైదరాబాద్‌కు రెఫర్ చేశారు. అక్కడి నుంచి తీసుకువెళ్తుండగా చనిపోయాడు. విషయం తెలుసుకున్న యాదగిరి భార్య శ్రీలత అస్వస్థతకు గురవడంతో ఆమెను దవాఖానకు తరలించారు. యాదగిరి స్వగ్రామం రామాయంపేట మండలం తొనిగండ్ల. మృతుడికి బిడ్డలు హరిత, హారిక ఉన్నారు. హరిత పెండ్లి కాగా, హారిక విదేశాల్లో ఉంటున్నారు. ఆమె వచ్చాక తొనిగండ్లలో అంత్యక్రియలు నిర్వహించనున్నన్నారు. యాదగిరి తమ్ముడు రమేశ్ నెల కింద ఉరేసుకొతని ఆత్మహత్య చేసుకోగా, అంతలోనే యాదగిరి చనిపోవడంతో ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది. యాదగిరి మృతిపై తోటి పోలీసులు, ఉన్నతాధికారులు సంతాపం వ్యక్తం చేశారు.