
కశ్మీర్లోని వాస్తవ పరిస్థితి గురించి మాట్లాడేవారిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అణచివేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ. కోల్‌కతాలో బుధవారం నిర్వహించిన విద్యార్థుల ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. ముఖ్యమైన ప్రభుత్వ సంస్థలకు కూడా తమకు అనుకూలంగా ఉన్న రిటైర్డ్ అధికారులను నియమించుకుంటున్నారని ఆరోపించారు. వారు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తున్నారని చెప్పారు. భారతదేశం అధ్యక్ష పాలనవైపుగా పయనిస్తోందని తెలిపారు. ఒకవేళ అదే జరిగితే దేశంలో ప్రజాస్వామ్యానికి స్థానం ఉండదన్నారు. ప్రతిపక్ష నేతలను బెదిరించడం… లేకపోతే డబ్బుతో కొనుగోలు చేయడం వంటివి చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న తనను అరెస్ట్ చేసినా భయపడేది లేదని తేల్చిచెప్పారు మమతా బెనర్జీ.