భద్రాచలంలో ట్రైబల్ స్టూడెంట్ల ఆరోగ్యంపై ఐటీడీఏ ఫోకస్

భద్రాచలంలో ట్రైబల్ స్టూడెంట్ల ఆరోగ్యంపై ఐటీడీఏ ఫోకస్
  • స్కూళ్లలో హెల్త్​ చెకప్స్​
  • ప్రతీ పాఠశాలకూ ఫస్ట్​ ఎయిడ్​ కిట్స్​ 
  • కొనసాగుతున్న సికిల్​సెల్​ నిర్ధారణ పరీక్షలు 
  • ఇప్పటికే 12,600 మందికి టెస్టులు 

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని ట్రైబల్​ వెల్ఫేర్​ స్కూళ్లలో చదివే స్టూడెంట్స్ ఆరోగ్యంపై తెలంగాణ సర్కార్​ ఫోకస్ పెట్టింది. వారి ఆరోగ్య రక్షణకు యాక్షన్​ ప్లాన్​ రూపొందించింది. 114 స్కూళ్లలో చదివే 15,834 మందికి మెడికల్​ చెకప్స్ నిర్వహిస్తున్నారు.  ప్రస్తుతం సికిల్​సెల్​ వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. ఇప్పటికే 12,600 మందికి వైద్య, ఆరోగ్యశాఖ టెస్టులు పూర్తి చేసింది. ప్రాణాంతకమైన ఈ వ్యాధిని ఆదిలోనే గుర్తిస్తే వైద్యంతో నివారించవచ్చనే ఉద్దేశ్యంతో చిన్నారుల పట్ల కేర్​ తీసుకుంటున్నారు. సెలవుల అనంతరం స్కూళ్లకు వచ్చే చిన్నారుల ఆరోగ్య స్థితిగతులపైనా నజర్ పెట్టారు. ప్రతీ స్టూడెంట్​ హెల్త్ ప్రొఫైల్​ స్కూల్​లో ఉండేలా పీవో బి.రాహుల్ చర్యలు తీసుకుంటున్నారు. వారి ఆరోగ్య భద్రతే లక్ష్యంగా ప్రతీ పీహెచ్​సీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. 

స్కూళ్లలో మెడికల్​ కిట్స్

ప్రతీ స్కూల్​లో మెడికల్ కిట్​ తప్పనిసరి చేస్తూ పీవో బి.రాహుల్​ ఆదేశాలు జారీ చేశారు. గిరిజన స్టూడెంట్లు అస్వస్థతకు గురైతే తక్షణమే ప్రథమ చికిత్సను అందిస్తారు. ఏడు రకాల వస్తువులతో కూడిన మెడికల్ కిట్​ను స్కూల్​కు అందజేయనున్నారు. ఈ మేరకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ మెడికల్​ కిట్ల కోసం షార్ట్ టెండర్లను పిలిచింది. వెయింగ్​ మిషన్, హైట్​ స్కేల్, బీపీ ఆపరేటర్, థర్మామీటర్, బ్యాండ్​ఎయిడ్​, టార్చ్, ఐవీ స్టాండ్ ఈ ఏడు వస్తువులతో మెడికల్ కిట్​ ఉంటుంది. వీటితో పాటు సమీప పీహెచ్​సీలు ఆయా స్కూళ్లకు కొన్ని మెడిసిన్స్ ఇస్తాయి. మెడికల్​ టీం స్కూల్​కు చేరుకునే లోపు స్టూడెంట్​కు టీచర్లు ప్రథమ చికిత్స అందిస్తారు. కోలుకున్నాక పరిస్థితిని బట్టి స్టూడెంట్​ను పీహెచ్​సీకి తరలిస్తారు.

 సీజనల్​ వ్యాధుల నేపథ్యంలో టీచింగ్​తో పాటు చిన్నారుల హెల్త్ కండీషన్లపైనే ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాల్సిన అవసరంపై ప్రతీ రివ్యూ మీటింగ్​లో ఐటీడీఏ అధికారులు టీచర్లకు సూచనలు జారీ చేస్తున్నారు. పిల్లలకు పెట్టే భోజనం, టిఫిన్స్, తాగునీటి విషయాల్లో, వంటశాల, డైనింగ్​ హాల్​, హాస్టల్​, స్కూల్​ పరిసరాల పరిశుభ్రతపై టీచర్లతో పాటు, వంట సిబ్బందికి కూడా డీడీ మణెమ్మ ఆధ్వర్యంలో ట్రైనింగ్స్ ఏర్పాటు చేశారు. కంటికి రెప్పలా స్టూడెంట్లను చూసుకోవాలని హాస్టల్స్, ఆశ్రమ స్కూళ్ల స్టాఫ్​కు సూచనలు ఇస్తున్నారు. నిత్యం స్టూడెంట్ల వివరాలు, వారి ఆరోగ్య స్థితిగతులు, చదువు అన్ని విషయాలు ఐటీడీఏ కేంద్రానికి ఏటీడీవోల ద్వారా పీవో, డీడీలకు నివేదికల రూపంలో అందజేసేలా యాక్షన్​ ప్లాన్ అమలు చేస్తున్నారు. 

అప్రమత్తత అవసరం

స్కూల్​, హాస్టల్​ ఎక్కడైనా పిల్లల విషయంలో స్టాఫ్​ అప్రమత్తతతో ఉండటం ఎంతో అవసరం. వానాకాలం వ్యాధులతో పాటు విషపురుగుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బాధ్యతతో వ్యవహరించి వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఫస్ట్ ఎయిడ్​ అక్కడే అందించేలా కిట్స్ ఇస్తున్నాం. ఏ విషయమైనా ముందుగా సమాచారం ఇవ్వాలి. మెడికల్ స్టాఫ్​ గ్రామాలు విజిట్​ చేసినప్పుడు తప్పనిసరిగా స్కూళ్లు, హాస్టళ్లలో విద్యార్ధులను టెస్ట్ చేసేలా సూచనలు చేశాం. 

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బి.రాహుల్​, పీవో