
వెలుగు: కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అభినందించారు. కేంద్రం నుంచి అవసరమైన సాయం అందిస్తామన్నారు. అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు, అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ యోగితా రాణా పాల్గొన్నారు. వైరస్ నియంత్రణకు తీసుకున్న చర్యలను కేంద్ర మంత్రికి ఈటల వివరించారు. ఎన్95 మాస్కుల కొరత ఉందని, వాటిని పంపించాలని కోరారు. కరోనా టెస్టులకు రాష్ట్రంలో ఇంకో ల్యాబ్ ఏర్పాటు చేయాలన్నారు. కాగా, కరోనాను కంట్రోల్ చేసేందుకు 15 మంది అధికారులతో రాష్ట్ర సర్కారు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌ను ఏర్పాటు చేసింది. జిల్లాల్లోనూ టీమ్‌లను ఏర్పాటు చేశారు. కరోనా అనుమానితులను గుర్తించి హాస్పిటళ్లకు తరలించడం, పాజిటివ్ కేసులతో కాంటాక్ట్ అయిన వాళ్లను గుర్తించడం, ఆయా ఏరియాల్లో శానిటేషన్ చేయడం వంటివి ఈ టీమ్‌లు చేస్తాయి. రాష్ట్రంలోని 40 ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో కరోనా ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేశారు.
గాంధీలో తగ్గిన ఓపీ…
గాంధీ ఆస్పత్రిలో కరోనా హైరానా తగ్గినట్టు కనిపించట్లేదు. ఎప్పుడూ జనం రద్దీతో కిటకిటలాడే ఆస్పత్రి శుక్రవారం ఖాళీగా కనిపించింది. రోగుల ఓపీ సగానికి పైగా తగ్గింది. రోజూ 2 వేల దాకా ఉండే ఓపీ, శుక్రవారం 930కి తగ్గిపోయింది. ఇక కరోనా అనుమానంతో 53 మంది గాంధీకి రాగా, 18 మందికి ఆ లక్షణాలు లేకపోవడంతో ఇంటికి పంపించారు. ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు. లక్షణాలున్న 15 మంది శాంపిళ్లను టెస్టులకు పంపించారు. అందులో ఆరుగురికి నెగెటివ్ రాగా, మరో 9 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. 12 మంది ఐసోలేషన్ వార్డులో ఉన్నారు. ట్రీట్మెంట్ తీసుకుంటున్న వ్యక్తి కోలుకుంటున్నాడని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. మరోవైపు శుక్రవారం డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) అధికారులు గాంధీలో కరోనా ఏర్పాట్లను పరిశీలించారు. వేగంగా టెస్టులు చేయాలని, వాళ్లను ఎప్పటికప్పుడు ఐసోలేషన్ వార్డుల్లో పరిశీలించాలని సూచించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 5,233 మందిని స్క్రీన్ చేశారు. అందులో ముగ్గురికి లక్షణాలుండడంతో గాంధీకి పంపించారు. కరోనా హెల్ప్‌లైన్‌కు 250 ఫోన్లు వచ్చినట్టు అధికారులు చెప్పారు. కరోనా వైరస్‌ను నివారించేందుకు దక్షిణ మధ్య రైల్వే ముందస్తు చర్యలు తీసుకుంటోంది. జోనల్ రైల్వే హాస్పిటల్‌తో పాటు ఆరు డివిజన్ కేంద్రాల్లోని ఆస్పత్రుల్లో కరోనా అనుమానితుల కోసం ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసింది. ప్రధాన స్టేషన్లలో సూచనల బోర్డులు, అనౌన్స్మెంట్లతో ప్రయాణికులకు అవగాహన కల్పిస్తోంది.
ట్రీట్మెంట్ చేసే లోపే వెళ్లిపోయిండు
ఓ వ్యక్తి రెండు రోజుల కిందట దుబాయ్ నుంచి సొంతూరుకు వచ్చాడు. దగ్గు, జలుబు ఉండడంతో ఆస్పత్రికి వెళ్లాడు. కరోనాగా అనుమానించి డాక్టర్లు ట్రీట్మెంట్ చేసే లోపే ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన శుక్రవారం జనగామ జిల్లా కేంద్రంలో జరిగింది. లింగాల గణపురం మండలం ఆర్టీసీ కాలనీకి చెందిన వ్యక్తి, శుక్రవారం స్నేహితుడితో కలిసి జనగామ ప్రభుత్వాస్పత్రికి వెళ్లాడు. అతడు దుబాయ్ నుంచి రావడం, కరోనా లక్షణాలుండడం వంటి కారణాలతో ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్లు సిద్ధమవుతుండగా, అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వెంటనే డాక్టర్లు అతడి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ట్రీట్మెంట్కు సహకరించాలని కోరారు. అయితే, తానెక్కడికి వెళ్లలేదని, ఇంట్లోనే ఉన్నానని, ఇబ్బంది ఉంటే తానే హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ చేయించుకుంటానని చెప్పాడు.
దుబాయ్ నుంచి వచ్చిన జగిత్యాల వ్యక్తికి..
జగిత్యాల జిల్లా గోపాల్‌రావుపేటకు చెందిన శైలెట్టి శ్రీహరి అనే వ్యక్తి కొంతకాలంగా దుబాయ్‌లో ఉంటున్నాడు. గత నెల 29న దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. స్నేహితుల దగ్గర ఓ రోజు ఉండి, తర్వాతి రోజు సొంతూరుకు వచ్చాడు. ఇంటికి వచ్చినప్పటి నుంచి జలుబు, దగ్గు, జ్వరం రావడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. నయం కాకపోవడంతో శుక్రవారం జిల్లా ప్రభుత్వాస్పత్రికి వెళ్లాడు. టెస్టులు చేసిన డాక్టర్లు కరోనా లక్షణాలున్నట్టు అనుమానించారు. వెంటనే అతడిని గాంధీ ఆస్పత్రికి ప్రత్యేక అంబులెన్సులో తరలించారు. అతడి స్నేహితులు, బంధువుల వివరాలు తీసుకుంటున్నట్టు డీఎంహెచ్‌వో శ్రీధర్ తెలిపారు.
వరంగల్ యువకుడికి…
వరంగల్‌కు చెందిన ఓ యువకుడు (24) కొంతకాలంగా ఇటలీలో ఉంటూ బుధవారం ఇంటికి వచ్చాడు. గురువారం అతడికి జలుబు, జ్వరం వచ్చినట్టు అనిపించడంతో కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతడి శాంపిళ్లను టెస్టుల కోసం గాంధీకి పంపించారు.