బ్లూ లైట్ వల్ల చర్మ సమస్యలు రాకుండా ఏం చేయాలంటే

బ్లూ లైట్ వల్ల చర్మ సమస్యలు రాకుండా ఏం చేయాలంటే

కరోనా కారణంగా ఈ రెండేండ్లలో డిజిటల్ స్క్రీన్​​ టైమింగ్​ పెరిగింది. ఇంట్లోనే ఎక్కువ సేపు ఉండడం, వర్క్​ఫ్రమ్​ హోమ్​ కూడా అందుకు కారణం. రోజులో ఎక్కువసేపు ఫోన్​ లేదా కంప్యూటర్​, ల్యాప్​టాప్​, టీవీ చూస్తూ గడిపేస్తున్నారు చాలామంది.  స్క్రీన్​ టైమ్​ పెరగడం వల్ల బ్లూ లైట్​ నేరుగా కళ్లు, చర్మం మీద పడుతుంది. దీనివల్ల కళ్ల ఆరోగ్యంతో పాటు చర్మం కూడా దెబ్బతింటుంది. 
బ్లూ లైట్ ఎఫెక్ట్​ నుంచి చర్మాన్ని కాపాడుకోవడానికి  డెర్మటాలజిస్ట్​ స్వప్న ప్రియ చెప్తున్న జాగ్రత్తలివి... 
బ్లూ లైట్​అనేది సూర్యకిరణాల్లో కూడా ఉంటుంది. ఇది ‘హై ఎనర్జీ విజిబుల్ లైట్’. కంప్యూటర్​, ల్యాప్​టాప్​, టీవీ, మొబైల్​ ఫోన్​ స్క్రీన్ల నుంచి కూడా బ్లూ లైట్​ వస్తుంది. ఎక్కువ టైమ్​  బ్లూ లైట్​కి ఎక్స్​పోజ్​ అయితే స్కిన్​ ప్రాబ్లమ్స్​ వస్తాయి. బ్లూ లైట్​ వల్ల నిద్ర వేళలు మారతాయని, చర్మ కణాల రిథమ్​ దెబ్బతింటుందని ‘ఇంటర్నేషనల్​ జర్నల్​ ఆఫ్​ కాస్మొటిక్​ సైన్స్​’లో వచ్చిన ఒక స్టడీ చెప్తోంది. అయితే, చర్మ సమస్యలకి బ్లూ లైట్​ ఒక్కటే కారణం కాదు. ఎలర్జీలు, జెనెటిక్​ కారణాల వల్ల కూడా స్కిన్​ ప్రాబ్లమ్స్​ వచ్చే ఛాన్స్​ ఉంది. 
ఎఫెక్ట్​ పడుతుందిలా...
స్క్రీన్ టైమ్​ పెరగడం వల్ల చాలామంది బ్లూ లైట్​కి ఎక్స్​పోజ్​ అవుతున్నారు. పగలు, రాత్రివేళ కూడా  బ్లూ లైట్​ ఎఫెక్ట్ ఒకేలా ఉంటుంది. బ్లూ లైట్​ వల్ల ఆక్సిడేటివ్​ స్ట్రెస్​ పెరుగుతుంది. అంటే కణాల్లో, కణజాలాల్లో తయారయ్యే రియాక్టివ్​ ఆక్సిజన్​ స్పీసెస్​ (ఆర్​ఒఎస్​) పోగవ్వడంతో  బ్యాలెన్స్​ తప్పుతుంది. దాంతో కణాల్ని దెబ్బతీసే ఫ్రీ–రాడికల్స్ లెవల్స్​ పెరుగుతాయి. వీటి వల్ల చర్మంలోని కొల్లాజెన్, ఎలాస్టిన్​  టిష్యూస్​ డ్యామేజ్​ అవుతాయి. దాంతో చర్మం సాగే గుణం కోల్పోతుంది. చర్మంపై ముడతలు వస్తాయి. బ్లూ లైట్ ఎఫెక్ట్ వల్ల కొందరిలో ‘మంగు మచ్చలు’, ‘మెలిస్మా’ వంటి చర్మ సమస్యలు  కనిపిస్తున్నాయి. సన్​స్క్రీన్స్​ వాడుతున్నా కూడా వీళ్లలో ఈ సమస్య తగ్గడం లేదు. 
బ్లూ లైట్​ కారణంగా వచ్చే సమస్యల్లో చాలావరకు కాస్మొటిక్ రకానికి చెందినవే. చర్మం డల్​గా కనిపించడం, పిగ్మెంటేషన్​, చర్మం ఎరుపెక్కడం, ముడతలు వంటి ప్రాబ్లమ్స్​ వస్తాయి. రెగ్యులర్​గా వాడే సన్​స్క్రీన్​తో ఈ సమస్యలు తగ్గవు. ఎందుకంటే... ఈ సన్​స్క్రీన్స్​ సూర్యకిరణాల్లో ఉండే అల్ట్రావయొలెట్​–ఎ, అల్ట్రా వయొలెట్​–బి కిరణాల నుంచి మాత్రమే స్కిన్​ని కాపాడతాయి. 
ఏం చేయాలంటే...
బ్లూ లైట్ కారణంగా చర్మ సమస్యలు రాకూడదంటే  స్క్రీన్​ టైమ్​ తగ్గించుకోవాలి. స్క్రీన్​ గార్డ్ ఉన్న ల్యాప్​టాప్స్​ వాడాలి. రాత్రిపూట లైట్స్​ ఆఫ్​ చేసి టీవీ, ఫోన్లు ఎక్కువ సేపు చూడొద్దు. బ్లూ లైట్​ నుంచి రక్షణ కోసం ఫిజికల్​ బ్లాకర్స్​ వాడాలి. జింక్​ ఆక్సైడ్​, టైటానియం ఆక్సైడ్​లు ఉన్న సన్​స్క్రీన్స్ ఫిజికల్ బ్లాకర్స్​లా పనిచేస్తాయి. ఇవి​ వాడితే బ్లూ లైట్​ నుంచి ప్రొటెక్షన్​ ఉంటుంది.