కరోనా పేషెంట్‌ను తీసుకెళ్తున్న‌ అంబులెన్స్‌పై రాళ్ల దాడి

కరోనా పేషెంట్‌ను తీసుకెళ్తున్న‌ అంబులెన్స్‌పై రాళ్ల దాడి

క‌రోనా ల‌క్ష‌ణాలున్న వ్య‌క్తుల‌తో వెళుతున్న అంబులెన్స్ పై కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు దాడి చేశారు. ఈ దారుణం ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని మొరదాబాద్‌లో జ‌రిగింది. మొరదాబాద్‌లోని హజీ నెబ్‌ మసీదు ప్రాంతంలో.. ఓ వ్యక్తికి కరోనా ఉన్నట్లు సమాచారం అందడంతో వైద్య సిబ్బంది, పోలీసులు అక్కడికి వెళ్లారు. దీంతో అత‌నితోపాటు వైర‌స్ సోకిన‌ట్టుగా అనుమానిస్తున్న మ‌రికొంద‌రు వ్య‌క్తుల్ని అంబులెన్స్‌లో ఎక్కించి, ఆస్పత్రికి వెళ్లేందుకు సిద్ధ‌మవుతుండ‌గా అల్ల‌రిమూక‌లు అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున గుమిగూడి ఇటుకలు, రాళ్లతో దాడిచేశారు.

దీంతో వాహనాల అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘ‌ట‌న‌లో ఇద్దరు వైద్య సిబ్బందితో పాటు.. పలువురు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. దీనిపై సమాచారం అందకున్న ఎఎస్సీ అమిత్ పాఠక్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వైద్య సిబ్బందిపై దాడిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంటువ్యాధుల నివారణ చట్టం, విపత్తు నిర్వహణ చట్టం, సెక్షన్ 144 ఉల్లంఘన కింద కేసులు పెడతామని స్పష్టం చేశారు. ఇటీవల ఇదే ప్రాంతంలో ఓ వ్యక్తి కరోనావైరస్‌తో చనిపోయాడు. అప్రమత్తమైన వైద్యాధికారులు మృతుడి కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్ సెంటర్‌కు తరలించాలనుకున్నారు. ఈ క్రమంలోనే వారిని క్వారంటైన్ సెంటర్‌కు తీసుకెళ్తుండగా స్థానికులు దాడి చేశారు.

అంబులెన్స్‌ డ్రైవర్ ఈ ఘ‌ట‌న గురించి మాట్లాడుతూ.. ఇది పక్కా ప్లాన్‌ ప్రకారం దాడి చేసినట్లు అర్దమవుతుందని.. తాము పేషెంటును అంబులెన్స్‌లో ఎక్కిస్తున్న సమయంలో లోనే.. ఓ గుంపు హఠాత్తుగా తమపై రాళ్ల దాడి జరిపిందని తెలిపాడు. ఈ దాడిలో డాక్టర్లతో పాటు తాము కూడా గాయపడ్డామని అత‌ను చెప్పాడు.