
- ఈడీ, సీబీఐ కేసులో పిటిషన్ల దాఖలు
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టయి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లు శుక్రవారం ఢిల్లీ హైకోర్టులో విచారణకు రానున్నాయి. లిక్కర్ స్కామ్లో ఈడీ, సీబీఐ అధికారులు కవితను అరెస్ట్ చేయగా... తనకు బెయిల్ మంజూరు చేయాలని గతంలో ఆమె పెట్టుకున్న పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. దీంతో ఈడీ కేసులో ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఈ నెల 9న కవిత హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
మరోవైపు సీబీఐ కేసులోనూ... సీబీఐ అరెస్ట్, రిమాండ్ ను, ట్రయల్ కోర్టు బెయిల్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ మరో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. కాగా, ఈ నెల 10న ఈడీ కేసులో, 16న సీబీఐ కేసుల్లో కవిత పిటిషన్లపై జస్టిస్ స్వర్ణ కాంత శర్మతో కూడిన ఏక సభ్య ధర్మాసనం వేర్వేరుగా విచారణ జరిపింది. కవిత దాఖలు చేసిన పిటిషన్లపై తమ స్పందన తెలపాలని దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ను శుక్రవారానికి (నేటికి) వాయిదా వేసింది.
మరోసారి వాయిదా పడే చాన్స్!
లిక్కర్ స్కామ్లో కవిత పాత్రపై ఇటీవల ఈడీ దాదాపు 8వేల పేజీలతో సప్లమెంటరీ చార్జ్ షీట్ దాఖలు చేసింది. అయితే.. ఈ చార్జ్ షీట్ ను పరిగణనలోకి తీసుకునే అంశంపై ఈ నెల 21న ట్రయల్ కోర్టు ఈడీ వాదనలను ముగించింది. ఈ అంశంపై తీర్పును ఈ నెల 29కి వాయిదా వేసింది. దీంతో హైకోర్టులో శుక్రవారం జరిగే బెయిల్ పిటిషన్లపై వాదనకు కొంత అడ్డు ఏర్పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెప్తున్నారు.
ఒకవేళ ట్రయల్ కోర్టు కవితపై వేసిన సప్లిమెంటరీ చార్జ్ షీట్ ను పరిగణనలోకి తీసుకొని ఉంటే.. చార్జ్ షీట్ దాఖలైన నేపథ్యంలో కవితకు బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరఫు అడ్వకేట్లు కోరేందుకు ఆస్కారం ఉండేదని అంటున్నరు. అయితే.. ఈ ఆప్షన్ లేకపోవడంతో, కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ మరోసారి వాయిదా పడొచ్చని అంటున్నరు.
కాగా, ఇప్పటికే సుప్రీం కోర్టుకు వేసవి సెలవులు ప్రకటించగా... ఢిల్లీ హైకోర్టుకు శుక్రవారం నుంచి సెలవులు ఇవ్వనున్నారు. మరోవైపు వచ్చే వారంతో ట్రయల్ కోర్టు కూడా వేసవి సెలవులు అమల్లోకి వచ్చే ఆస్కారం ఉంది. దీంతో శుక్రవారం హైకోర్టులో జరిగే వాదనల్లో కవితకు ఉపశమనం లభించక, విచారణ వాయిదా పడితే... మరో నెల రోజుల పాటు ఆమె తిహార్ జైల్లోనే ఉండాల్సి వస్తుందని అంటున్నరు.