కిచెన్ తెలంగాణ..గుండె ఆరోగ్యం కోసం

కిచెన్ తెలంగాణ..గుండె ఆరోగ్యం కోసం

ఇంతకుముందు నోటికి రుచిగా ఉండే ఫుడ్​ తినడానికి ఇష్టపడేవాళ్లు. ప్రస్తుతం ఆ ట్రెండ్ మారింది. ఐరన్ తక్కువైతే పాలకూర. క్యాల్షియం కోసం పాలు, ప్రొటీన్​ కావాలంటే కోడిగుడ్లు... అంటూ పోషకాల​ని లెక్కపెట్టుకుని తింటున్నారు చాలామంది. ఆ మార్పు మంచిదే! కాబట్టి ‘వరల్డ్ హార్ట్​ డే’ సందర్భంగా గుండె ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన రెసిపీలు  మీ కోసం...

  మొలకెత్తిన పెసలతో పరాటా

కావాల్సినవి :

మొలకెత్తిన పెసలు - ఒకటిన్నర కప్పు
ఆలుగడ్డ (ఉడికించి) - ఒకటి
జీలకర్ర - ఒక టీస్పూన్
పచ్చిమిర్చి - రెండు
అల్లం తరుగు, గరం మసాలా - ఒక్కోటి అర టీస్పూన్
ఇంగువ, పసుపు, ఆమ్​చూర్ పొడి -  ఒక్కోటి పావు టీస్పూన్
కారం, ధనియాల పొడి - ఒక్కోటి అర టేబుల్ స్పూన్
నూనె, ఉప్పు - సరిపడా
పుదీనా, మెంతికూర తరుగు - ఒక్కోటి అర కప్పు
ఉల్లి కాడల తరుగు - ముప్పావు కప్పు
కొత్తిమీర - కొంచెం
గోధుమ పిండి - రెండు కప్పులు
పాలకూర తరుగు - ఒక కప్పు

తయారీ : ఒక పాన్​లో నూనె వేడి చేసి జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం తరుగు, ఇంగువ వేగించాలి. తర్వాత అందులో మొలకెత్తిన పెసలు కూడా వేసి, కొన్ని నీళ్లు చల్లి మరికాసేపు వేగించాలి. మూత పెట్టి పది నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించాలి. ఆ తర్వాత ఉడికించిన ఆలుగడ్డను నలిపి మిశ్రమంలో వేయాలి. దాంతో పాటు పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఆమ్​చూర్ పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. పుదీనా, ఉల్లికాడల తరుగు, కొత్తిమీర వేసి కలిపి మూతపెట్టి రెండు నిమిషాలు ఉడికించాలి. ఒక గిన్నెలో గోధుమపిండి, పాలకూర, మెంతికూర తరుగు, ఉప్పు, నూనె వేసి, కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ ముద్దలా కలిపి మూతపెట్టి పక్కన పెట్టాలి. ఆ తర్వాత పిండి ముద్దను ఉండలు చేసి, చపాతీలు వత్తాలి. అందులో రెడీ చేసి పెట్టిన మిశ్రమాన్ని స్టఫ్​ చేసి, మరోసారి వత్తాలి. వీటిని వేడి వేడి పెనం మీద వేసి, నూనె రాసి రెండు వైపులా కాల్చాలి.

అవిసె గింజల పొడికారం

కావాల్సినవి :

అవిసె గింజలు  : ఒక కప్పు
మినపప్పు, శనగపప్పు, కొబ్బరి పొడి : ఒక్కోటి పావు కప్పు చొప్పున
నూనె : రెండు టేబుల్ స్పూన్లు
ఎండుమిర్చి :  ఐదు
కరివేపాకు : కొంచెం
జీలకర్ర : ఒక టీస్పూన్
చింతపండు  : ఒక టేబుల్ స్పూన్
ఉప్పు  : సరిపడా
ఇంగువ  : పావు టీస్పూన్

తయారీ : పాన్​లో నూనె వేడి చేసి ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, చింతపండు వేసి సన్నటి మంట మీద వేగించాలి. తరువాత కొబ్బరి పొడి వేసి గోధుమ రంగు వచ్చేవరకు వేగించాలి. మిక్సీజార్​లో ఆ మిశ్రమం, అవిసె గింజలు, మినపప్పు, శనగపప్పు వేసి గ్రైండ్ చేయాలి. ఈ పొడిని ఇడ్లీ, దోశ, ఉప్మా లో తింటే బాగుంటుంది.

పనీర్ - మటర్ బిర్యానీ

కావాల్సినవి :  

పనీర్ - అర కప్పు
పచ్చి బటానీలు (ఉడికించి) ఉల్లిగడ్డ తరుగు, పాలు - ఒక్కోటి పావు కప్పు
ఎండుమిర్చి, వెల్లుల్లి పేస్ట్ - ఒక టీస్పూన్
పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, కారం, గరం మసాలా, కసూరీ మేథీ - ఒక్కోటి అర టీస్పూన్
టొమాటో గుజ్జు - అర కప్పు
చక్కెర - చిటికెడు

తయారీ :  ఒక గిన్నెలో బియ్యాన్ని రెండు గంటలు నానబెట్టాలి. తర్వాత నీళ్లని వంపేయాలి. ఒక గిన్నె​లో నీళ్లు కాగబెట్టి, అందులో ఉప్పు, నానబెట్టిన బియ్యం వేసి ఉడికించాలి. ఆ తర్వాత ఉడికిన అన్నం మీద చల్లటి నీళ్లు పోసి, వడకట్టాలి. తరువాత అన్నాన్ని వెడల్పాటి ప్లేట్​లో వేసి మూతపెట్టాలి.  పాన్ వేడెక్కాక ఉల్లిగడ్డ తరుగును నూనె లేకుండా వేగించాలి. అందులోనే ఎండుమిర్చి, వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేసి, కొన్ని నీళ్లు చల్లి కలపాలి. తరువాత టొమాటో గుజ్జు, కారం, గరం మసాలా, చక్కెర, కసూరీ మేతీ వేసి కలపాలి. మరికొన్ని నీళ్లు పోసి కాసేపు ఉడికించాలి. మిశ్రమం దగ్గరపడేటప్పుడు పనీర్ ముక్కలు కూడా వేయాలి. వాటితోపాటు ఉడికించిన పచ్చిబటానీలు, ఉప్పు వేసి కలపాలి. మరొక పాన్​లో ఉల్లిగడ్డ తరుగు వేసి కాస్త వేగాక, నీళ్లు పోసి కలపాలి. తర్వాత అందులో అన్నం, ఉప్పు వేసి కలపాలి. ఆ అన్నాన్ని ఒక గిన్నెలోకి తీసి దాని మీద పనీర్ మిశ్రమం వేయాలి. ఆ పై మళ్లీ అన్నంతో కవర్​ చేయాలి. పైన పాలు పోసి మూత పెట్టాలి. పది నిమిషాలు ఆవిరి మీద ఉడికించాలి. అంతే... ఎంతో టేస్టీగా, హెల్దీగా ఉండే బిర్యానీ రెడీ. 

యాపిల్ - వాల్​నట్ ఖీర్

కావాల్సినవి :

యాపిల్ తురుము - పావు కప్పు
పాలు, ఓట్స్ - ఒక్కోటి ఒకటిన్నర కప్పు
వాల్​నట్స్ తరుగు - రెండు టేబుల్ స్పూన్లు
నెయ్యి - రెండు టీస్పూన్లు
చక్కెర - ఒక టేబుల్ స్పూన్

తయారీ : పాన్​లో నెయ్యి వేడి చేసి వాల్ నట్స్ తరుగు, ఓట్స్ వేగించాలి. తర్వాత యాపిల్ తురుము కూడా వేగించాలి. ఒక గిన్నె​లో పాలు కాగబెట్టి అందులో యాపిల్ తురుము, వాల్ నట్స్, ఓట్స్, చక్కెర వేసి ఉడికించాలి. ఖీర్​ తయారయ్యాక అందులో యాలకుల పొడి చల్లి కలపాలి. 


వెజ్ బార్లీ ఇడ్లీ 

కావాల్సినవి :

బార్లీ గింజలు (నానబెట్టి) - ఒక కప్పు
మెంతులు -  పావు టేబుల్ స్పూన్
పొట్టు మినపప్పు (నానబెట్టి) - అర కప్పు
క్యారెట్ తురుము, క్యాప్సికమ్, బీన్స్ తరుగు - ఒక్కోటి పావు కప్పు చొప్పున
పెరుగు - రెండు టేబుల్ స్పూన్లు
ఉప్పు - సరిపడా
పచ్చిమిర్చి - మూడు
కొత్తిమీర, కరివేపాకు - కొంచెం
జీలకర్ర - ఒక టేబుల్ స్పూన్
ఇంగువ, పసుపు - ఒక్కో చిటికెడు
నూనె - మూడు టేబుల్ స్పూన్లు

తయారీ : మిక్సీజార్​లో నానబెట్టిన బార్లీ గింజలు, పొట్టు మినపప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఒక పాన్​లో నూనె వేడి చేసి, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, ఇంగువ, పచ్చిమిర్చి వేగించాలి. తర్వాత అందులోనే బీన్స్, క్యాప్సికమ్​ తరుగు, క్యారెట్ తురుము, ఉప్పు, పసుపు వేసి మరికాసేపు వేగించాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీయాలి. అందులో మిక్సీ పట్టిన బార్లీ మిశ్రమం వేయాలి. ఆ తర్వాత ఉప్పు, పసుపు, పెరుగు వేసి కలిపితే ఇడ్లీ పిండి రెడీ. ఆ పిండిని నూనె రాసిన ఇడ్లీ ప్లేట్​లో వేసి, మూత పెట్టి ఆవిరి మీద పది నిమిషాలు ఉడికించాలి.