తేనెటీగ కుట్టింది.. గుండె మారింది

తేనెటీగ కుట్టింది.. గుండె మారింది

తేనెటీగ కుడితే ఎవరికైనా మస్తు నొప్పయితది. మరీ గుంపులుగా వచ్చి కుడితే, ఒళ్లంతా వాటి ముండ్లు గుచ్చుకుపోయి ఉంటే హాస్పిటల్​కు పోవాల్సి వస్తది. విషం మరీ ఎక్కువగా శరీరంలోకి చేరితే చాలా అరుదుగా మాత్రమే ప్రాణాల మీదకు వస్తది. కానీ..  మహారాష్ట్రలోని నవీ  ముంబైలో మాత్రం ఓ రైతు గుండె ఫెయిలైపోయింది! కుట్టింది కూడా ఒకే ఒక్క తేనెటీగ.  గుండె మార్పిడి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది! తమకు తెలిసినంతవరకూ ఇలా తేనెటీగ కుట్టడం వల్ల గుండె మార్పిడి జరిగిన తొలి కేసు ఇదేనని అక్కడి డాక్టర్లు చెబుతున్నారు. ఆశ్చర్యం కలిగించే ఈ సంఘటన వెనక పెద్ద స్టోరీయే ఉంది.

ఒక్క తేనెటీగ వల్లే…

ఆ రైతు పేరు రాజీవ్​ వాఘ్మేర్. ఉండేది నవీ ముంబై సమీపంలోని అహ్మద్​నగర్. అతడు 2017 జూన్​లో ఒకరోజు పొలంలో పని చేసుకుంటుండగా ఎక్కడి నుంచో వచ్చిన ఒక తేనెటీగ కుట్టింది.  నొప్పి అయినా అతడు పెద్దగా పట్టించుకోలేదు. కొన్ని రోజులు గడిచిపోయాయి. ఉన్నట్టుండి ఒకరోజు అతడికి ఛాతీలో తీవ్ర నొప్పి వచ్చింది. దీంతో అహ్మద్​నగర్​లోని ఓ డాక్టర్​ దగ్గరకు వెళ్లగా గుండె దగ్గర ఓ ధమని పూడుకుపోయినట్లు యాంజియోగ్రామ్‌లో తేలింది. డాక్టర్‌ మందులు ఇచ్చి ఇంటికి పంపాడు. కానీ.. కొన్ని రోజులకు మళ్లీ గుండె నొప్పి వచ్చింది. ఈసారి పుణేలోని ఓ హాస్పిటల్​కు వెళ్లాడు. గుండె ధమని 50% పూడుకుపోయినట్లు తేలింది. అక్కడా మందులు ఇచ్చి ఇంటికి పంపారు. కొన్నిరోజులకు ప్రాబ్లం మళ్లీ స్టార్టయింది. దీంతో నవంబరు 2017లో ముంబైలోని ఓ హాస్పిటల్​కు వెళ్లగా డాక్టర్లు యాంజియోప్లాస్టీ చేశారు. మళ్లీ మళ్లీ సమస్య రావడంతో మళ్లీ మళ్లీ యాంజియోప్లాస్టీ చేశారు. అయినా గుండె వీక్​అయిపోయింది. రాజీవ్​చివరకు ఈ ఏడాది జనవరిలో బేలాపూర్​లోని అపోలో హాస్పిటల్​కు వెళ్లాడు.

లక్కీగా గుండె దొరికింది

బేలాపూర్​ హాస్పిటల్​కు వచ్చేనాటికి అతడి గుండె ఆర్టరీ 70% పూడుకుపోయింది. గుండె 20% మాత్రమే పనిచేస్తోంది. మామూలు పనులు కూడా చేసుకోలేకపోతున్నాడు. ఇక గుండె మార్పిడి తప్ప వేరే మార్గం లేదని డాక్టర్లు తేల్చేశారు. గుండె దాత కోసం  వెతకగా.. లక్కీగా కొన్ని రోజులకే ఒక బ్రెయిన్ ​డెడ్​పేషెంట్​ గుండె  సూటయింది. పోయిన నెల 27న ఆపరేషన్​సక్సెస్​అయింది. కొత్త గుండెతో రాజీవ్​వాఘ్మేర్ సమస్య తీరింది.  ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడని, కొత్త గుండె బాగా పనిచేస్తోందని అతడికి ఆపరేషన్​ చేసిన డాక్టర్ ​సంజీవ్ ​జాదవ్ ​వెల్లడించారు. తేనెటీగ కుట్టడం వల్ల అతడికి ఎండ్–స్టేజ్​ హార్ట్​ డిసీజ్​(ఇష్కీమిక్‌​ కార్డియోమయోపతీ) వచ్చినట్లు నిర్ధారణ అయిందని, దీనివల్ల అతడి గుండెకు చెందిన ఓ ఆర్టరీ అనేక చోట్ల పూడుకుపోయిందని ఆయన తెలిపారు. ఇంత చిన్న వయసులో ఇలా ఒక్క తేనెటీగ కుట్టడం వల్ల ఈ సమస్య రావడం అనేది తాము ఇంతవరకూ చూడలేదని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.