వేడిపాలు.. చల్లటి పాలు.. ఏ పాలు తాగితే మంచిది?

వేడిపాలు.. చల్లటి పాలు.. ఏ పాలు తాగితే మంచిది?

ఆరోగ్యం కోసం ప్రతిరోజు ఒక గ్లాసు పాలు తాగితే మేలు. పాలల్లో క్యాల్షియం, విటమిన్ – -డి, పొటాషియం ఉంటాయి. అందుకే, పిల్లలకు రోజుకు రెండుసార్లు పాలు తాగిస్తారు. కొంతమంది వేడి వేడి పాలు తాగేస్తారు. ఇంకొంతమంది పూర్తిగా చల్లారాక తాగుతారు. అయితే, వేడి పాలు మంచివా?చల్లటి పాలు తాగితే మంచివా? అనేది చాలామందిలో ఉన్న ప్రశ్న. మరి దానికి డాక్టర్లు ఏం చెప్తున్నారంటే...

పాలల్లో ఎముకలకు బలాన్ని ఇచ్చే క్యాల్షియం, విటమిన్‌ – డి పుష్కలంగా ఉంటాయి. పాలు తాగడం వల్ల చాలా రోగాలకు చెక్‌ పెట్టొచ్చు. అయితే సీజన్‌కు తగ్గట్లుగా పాలు తాగాలని చెప్తున్నారు డాక్టర్లు. వేసవికాలంలో చల్లటి పాలు, చలికాలంలో వేడి వేడి పాలు తాగడం బెటర్‌‌ అంటున్నారు. రాత్రి పడుకునేటప్పుడు మాత్రం చల్లటి పాలు తాగొద్దని. చల్లటి పాలు తాగడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

వేడి పాలు తాగితే.. 
వేడి పాలు తాగడం వల్ల డైజెషన్‌కు సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి. డయేరియా, గ్యాస్ట్రిక్‌ ప్రాబ్లమ్స్‌ లాంటివి దూర మవుతాయి. రాత్రి పడుకునేటప్పుడు వేడి పాలు తాగితే హాయిగా నిద్రపడుతుంది. వేడి పాలల్లోని ట్రిప్టోపాన్‌ నిద్రపట్టేందుకు ఉపయోగపడే సెరొటోనిన్​, మెలటోనిన్‌ను ప్రొడ్యూస్‌ చేస్తుంది. చలికాలం, వానాకాలంలో వేడివేడి పాలు తాగితే చర్మం వెచ్చగా ఉంటూ బాగా నిద్రపడుతుంది.  పాలు తాగడం వల్ల వెయిట్‌ పెరుగుతుంది అనేది చాలా మందిలో అపోహ ఉంది. నిజానికి పాలల్లో ఉండే క్యాల్షియం వల్ల మెటబాలిజమ్‌ పెరిగి కేలరీలు కరుగుతాయట.

చల్లటి పాలు తాగితే..
క్యాల్షియం తక్కువగా ఉన్నవాళ్లు చల్లటి పాలు తాగాలి. చల్లటి పాలల్లో క్యాల్షియం పుష్కలం. దాంతో పాటు పొట్టలో ఇరిటేషన్‌, ఎసిడిటీ సమస్యలు ఉన్నవాళ్లు చల్లటి పాలు తాగితే రిలీఫ్‌  ఉంటుంది. చల్లటి పాలల్లో ఉండే ఎలక్ట్రోలైట్స్‌ శరీరంలో నీటి శాతం తగ్గకుండా చేస్తాయి. అయితే, రాత్రి పడుకునేముందు చల్లటి పాలు తాగితే జీర్ణ సమస్యలు వస్తాయి. అంతేకాకుండా జలుబు, దగ్గు లాంటి సమస్యలు కూడా వస్తాయి.