
- రెండు రోజుల్లో 54 మంది మృతి
- బిహార్‌లోనే 32 మంది మృత్యువాత
- ఎండదెబ్బ తాళలేక పిట్టల్లా రాలుతున్న జనం
- నాగ్‌పూర్‌లో 56 డిగ్రీల సెల్సియస్ నమోదు?
- దేశవ్యాప్తంగా యావరేజ్ టెంపరేచర్ 45 డిగ్రీలు
న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాలన్నీ భానుడి భగభగతో అల్లాడుతున్నాయి. వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. గడిచిన రెండురోజుల్లోనే దేశవ్యాప్తంగా వదడెబ్బతో 54 మంది మృతిచెందారు. బిహార్‌కు చెందినవారే గరిష్టంగా 32 మంది హీట్‌స్ట్రోక్‌తో కన్నుమూయడం కలవరపెడుతోంది. ఒడిశాలో 12 మంది, జార్ఖండ్ 5, రాజస్థాన్ 5, ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు, మధ్యప్రదేశ్‌లో ఇద్దరు వడగాలులు తాళలేక కన్నుమూశారు.
కాగా, బిహార్‌లో కన్నుమూసినవారిలో 10 మంది ఎన్నికల సిబ్బంది ఉన్నట్టు డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా కోసం సిఫార్సు చేసినట్టు తెలిపింది. కాగా, బిహార్ దర్భంగాకు చెందిన 40 ఏండ్ల వ్యక్తి ఢిల్లీలో వడదెబ్బతో మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయి కన్నుమూశాడని వైద్యులు తెలిపారు. ఆ సమయంలో అతడి బాడీ టెంపరేచర్ 108 డిగ్రీల ఫారన్‌హీట్ వద్ద ఉన్నదని, అది శరీర సాధారణ ఉష్ణోగ్రత కంటే 10 డిగ్రీలు ఎక్కువ అని తెలిపారు. అలాగే, జార్ఖండ్‌లో వడదెబ్బతో 1300 మంది అస్వస్థతకు గురై, చికిత్స పొందుతున్నారు.
దేశవ్యాప్తంగా అసాధారణ టెంపరేచర్స్
దేశవ్యాప్తంగా అసాధారణ టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఢిల్లీలో గురువారం (మే 30) గరిష్టంగా 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే 5.2 డిగ్రీలు ఎక్కువ. ఐఎండీ డేటా ప్రకారం..దేశ రాజధానిలో 79 ఏండ్ల తర్వాత ఇదే గరిష్ట ఉష్ణోగ్రత కావడం గమనార్హం. అలాగే, రాజస్థాన్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, ఒడిశా, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భలో 45–-48 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్రికార్డయినట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఇక పశ్చిమ మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్కోస్తాతీరంలోని యానాం, రాయలసీమ, తెలంగాణ, గుజరాత్లో 42–45 డిగ్రీ సెల్సియస్‌ల ఉష్ణోగ్రత నమోదైనట్టు వెల్లడించింది. వాయువ్య , మధ్య, తూర్పు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో 36 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ టెంపరేచర్ రికార్డయినట్టు తెలిపింది. పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, ఒడిశాకు జూన్ 1 (నేడు) న తీవ్రమైన హీట్‌వేవ్ ముప్పు పొంచి ఉన్నదని వెల్లడించింది.
వడదెబ్బ మృతుల సంఖ్యను రాజస్థాన్ సర్కారు దాస్తున్నది : కాంగ్రెస్
రాజస్థాన్‌లో వడదెబ్బతో 100 మంది మృతిచెందారని, కానీ బీజేపీ సర్కారు ఆ సంఖ్యను దాచిపెడుతున్నదని కాంగ్రెస్ ఆరోపించింది. నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుందని రాష్ట్ర సర్కారు ఆదేశాలమేరకు అధికారులు మృతుల అసలు సంఖ్యను వెల్లడించడం లేదని ఆ పార్టీ రాజస్థాన్ యూనిట్ చీఫ్ గోవింద్ సింగ్ దోస్తారా అన్నారు. హీట్‌స్ట్రోక్‌తో ఐదుగురు మరణించారని రాజస్థాన్ సర్కారు వెల్లడించింది. మీడియాలో వస్తున్న మృతుల సంఖ్యలో వాస్తవం లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో బీజేపీ సర్కారుపై కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. హీట్‌వేవ్స్ పరిస్థితులను ఎదుర్కోవడంలో రాష్ట్ర సర్కారు విఫలమైందని మండిపడింది.
నిప్పుల కుంపటిలా నాగ్‌పూర్
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నిప్పుల కుంపటిని తలపిస్తున్నది. నార్త్ అంబజారి రోడ్‌కు దూరంగా ఉన్న రామ్‌దాస్‌పేత్‌లోని ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ (ఏడబ్ల్యూఎస్) 56 డిగ్రీల సెల్సియస్ఉష్ణోగ్రతను నమోదు చేసింది. ఇది ఇటీవల ఢిల్లీలోని ముంగేష్‌పూర్ స్టేషన్లో రికార్డు అయిన 52.9 డిగ్రీల కంటే ఎక్కువ. అలాగే, మహారాష్ట్రలోని సోనెగావ్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం (ఆర్ఎంసీ) వెంబడి ఏడబ్ల్యూఎస్ కూడా 54 డిగ్రీలు, వార్ధా రోడ్‌లోని ఖాప్రీ వద్ద సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాటన్ రీసెర్చ్ (సీఐసీఆర్) లోని ఏడబ్ల్యూఎస్ 44 డిగ్రీలు, రామ్‌టెక్ ఏడబ్ల్యూఎస్ 44 డిగ్రీల సెల్సియస్‌ను చూపించింది. అయితే ఢిల్లీ చరిత్రలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయిందోలేదోనని చెక్ చేస్తామని ఇటీవలే కేంద్రం స్పందించింది. అక్కడ సెన్సార్ పనిచేస్తుందో, లేక నిజంగానే రికార్డ్ అయిందో నని అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై ఇప్పటికే స్క్రుటినీ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో తాజాగా నాగ్ పూర్‌లో 56 డిగ్రీల ఉష్ణోగ్రత నిజమో కాదో తేలాల్సి ఉంది.
దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు ముందుగానే రుతుపవనాలు
దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు ముందుగానే నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నట్టు ఐఎండీ తెలిపింది. లక్షద్వీప్, కేరళ, కర్నాటకలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడు, అస్సాం, మేఘాలయలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు చేరుకుంటున్నాయని తెలిపింది. పశ్చిమ బెంగాల్, సిక్కింలకు మరో రెండు, మూడు రోజుల్లోనే విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే, రెండు రోజుల్లో వాయువ్య రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
జాతీయ విపత్తుగా ప్రకటించాలి : రాజస్థాన్ హైకోర్టు
వడదెబ్బతో వందలాది మంది చనిపోవడంపై రాజస్థాన్ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో టెంపరేచర్లు 50 డిగ్రీలు దాటిపోతున్నందున హైకోర్టు కీలక కామెంట్లు చేసింది. హీట్ వేవ్స్ పరిస్థితులను జాతీయ విపత్తులుగా ప్రకటించాలని కేంద్రానికి సూచించింది. మనం వెళ్లిపోయేందుకు మరో గ్రహం (ప్లానెట్ బీ) లేదని, ఇప్పుడు కఠిన చర్యలు తీసుకోకపోతే మన భవిష్యత్తు తరాలు మనుగడ సాగించలేవని వ్యాఖ్యానించింది. హీట్ వేవ్స్, కోల్డ్ వేవ్స్ పరిస్థితులను నేషనల్ కెలామిటీస్ గా ప్రకటించాలని సూచించింది.