మిల్లుకు పోగానే తేమ, తాలు ఎట్ల పెరుగుతది? 

మిల్లుకు పోగానే తేమ, తాలు ఎట్ల పెరుగుతది? 
  •  గంధమళ్ల రిజర్వాయర్​ నిర్మాణం ఉన్నట్టా? లేనట్టా?
  •  నిర్వాసితులకు పరిహారం ఎప్పుడిస్తరని నిలదీత

యాదాద్రి, వెలుగు;వడ్ల కొనుగోలుపై యాదాద్రి జడ్పీ మీటింగ్​లో హాట్​హాట్​గా చర్చ జరిగింది. వడ్లలో తేమ, తాలు శాతం మిల్లుకు పోయేసరికి ఎలా పెరుగుతదని సభ్యులు అధికారులను ప్రశ్నించారు. వడ్ల కొనుగోలులో ఉద్దేశ పూర్వకంగా మిల్లర్లు తప్పు చేసినా.. రైతుల పొరపాటు ఉన్నా కేసులు నమోదు చేయాలని జడ్పీ చైర్మన్​ ఎలిమినేటి సందీప్​ రెడ్డి ఆఫీసర్లకు సూచించారు. బుధవారం యాదాద్రి జడ్పీ మీటింగ్​ జరిగింది. ఈ సందర్భంగా వడ్ల కొనుగోలు, గంధమళ్ల రిజర్వాయర్, నిర్వాసితులకు పరిహారం అంశాలపై సీరియస్​గా చర్చ జరిగింది. మధ్యమధ్యలో జడ్పీ చైర్మన్​ఎలిమినేటి సందీప్​రెడ్డి జోక్యం చేసుకోవడంతో మెంబర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. 

‘గంధమళ్ల’ సంగతేంటి? 

ఆలేరు నియోజవర్గానికి ఉపయోగపడే గంధమళ్ల రిజర్వాయర్​ నిర్మాణం ఉన్నట్టా..? లేనట్టా..? అని సభ్యులు ఆఫీసర్లను ప్రశ్నించారు. రిజర్వాయర్​  కెపాసిటీని 9.28 టీఎంసీ నుంచి 4.38 టీఎంసీలకు ఎందుకు కుదించారని నిలదీశారు. బస్వాపూర్​ రిజర్వాయర్​ కారణంగా ఆలేరు నియోజకవర్గంలోని లప్ప నాయక్​ తండా పూర్తిగా మునిగిపోతున్న విషయాన్ని గుర్తు చేస్తూ పరిహారం ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. భువనగిరి నియోజకవర్గంలోని గ్రామాలకు పరిహారం ఇచ్చినప్పుడు ఆలేరు నియోజకవర్గంలోని గ్రామాలకు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. బునాదిగాని కాల్వ పరిస్థితి ఏంటని మెంబర్లు ప్రశ్నించారు. వడ్ల కొనుగోలు విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా కలెక్టర్​పమేలా సత్పతి తెలిపారు.  వడ్ల పైసలు రైతుల ఖాతాల్లో సాధ్యమైనంత తొందరగా వేస్తున్నామని చెప్పారు. మీటింగ్​లో అడిషనల్​ కలెక్టర్​ దీపక్​తివారి, సీఈవో కృష్ణారెడ్డి, జడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు.

సెంటర్లు తెరచి రెండు నెలలైనా..

సెంటర్లు ప్రారంభించి రెండు నెలలు గడిచినా వడ్ల కొనుగోలు ఎందుకు స్పీడప్​​ చేస్తలేరని కాంగ్రెస్​ జడ్పీ ఫ్లోర్ ​లీడర్ ​డాక్టర్ ​కుడుదల నగేశ్​ ఆఫీసర్లను ప్రశ్నించారు. కొనుగోళ్లు ఆలస్యం కావడం వల్ల రైతులు ఇబ్బంది పడతున్నారని చెప్పారు. కొనుగోలు సెంటర్​లో వడ్లలో తేమ, తాలు శాతం తక్కువగా ఉండి, రైస్​ మిల్లుకు పోయే సరికి  ఎలా పెరుగుతుందని నిలదీశారు. దీంతో జడ్పీ చైర్మన్​జోక్యం చేసుకోవడంపై సభ్యులు స్పందిస్తూ ఆఫీసర్లు సమాధానం చెబుతున్నప్పుడు మధ్యలో ఎందుకు కల్పించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.