భక్తులతో గుట్ట కిటకిట.. ఒక్కరోజే రూ.57.47 లక్షల ఆదాయం

భక్తులతో గుట్ట కిటకిట.. ఒక్కరోజే రూ.57.47 లక్షల ఆదాయం

యాదగిరిగుట్ట, వెలుగు :వరుస సెలవులు రావడంతో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి భక్తులు క్యూ కట్టారు. హైదరాబాద్  సహా రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో గుట్ట ఆలయం కిక్కిరిసింది. కొండపైన ఎక్కడ చూసినా భక్తుల సందడి కనిపించింది. రద్దీ కారణంగా స్వామివారి ధర్మ దర్శనానికి నాలుగు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంటన్నర పైగా సమయం పట్టింది.

కొండపైన, కింద ఆలయ పరిసరాలు భక్తజన సందోహంగా మారాయి. కొండ కింద కల్యాణకట్ట, లక్ష్మిపుష్కరిణి, పార్కింగ్  ఏరియా, సత్యనారాయణస్వామి వ్రత మండపాలు భక్తులతో కోలాహలంగా కనిపించాయి. కొండపైన బస్ బే, దర్శన, ప్రసాద క్యూలైన్లు సైతం కిక్కిరిశాయి. ఆలయంలో నిర్వహించిన స్వామివారి నిత్య కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

నారసింహుడి సేవలో గవర్నర్ సెక్రటరీ

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని ఆదివారం గవర్నర్  సెక్రటరీ, ఐఏఎస్ ఆఫీసర్  సురేంద్ర మోహన్, ఇంటెలిజెన్స్ ఎస్పీ శిరీష తమ కుటుంబ సభ్యులతో వేర్వేరుగా దర్శించుకున్నారు. గర్భగుడిలో స్వయంభూ నారసింహుడిని దర్శించుకుని ప్రధానాలయ ముఖ మండపంలో స్వామివారి ఉత్సవ మూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శనం కల్పించారు. అర్చకులు వారికి వేదాశీర్వచనం చేయగా.. ఈవో రామకృష్ణారావు, సూపరింటెండెంట్  రాజన్ బాబు లడ్డూప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేశారు. మరోవైపు ఆలయంలో నిత్య పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి.

ఉదయం సుప్రభాతంతో మొదలై రాత్రి పవళింపు సేవతో ముగిశాయి. ఇక భక్తులు జరిపించిన పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆదివారం ఒక్కరోజు ఆలయానికి రూ.57,47,013 ఆదాయం సమకూరింది. అత్యధికంగా ప్రసాద విక్రయం ద్వారా రూ.26,25,260, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.7 లక్షలు, వీఐపీ దర్శన టికెట్ల ద్వారా రూ.8.25 లక్షలు, బ్రేక్  దర్శనాలతో రూ.4,43,700, ప్రధాన బుకింగ్  ద్వారా రూ.2,40,250 ఆదాయం వచ్చిందని ఆలయ ఆఫీసర్లు వెల్లడించారు.