వరద బీభత్సంతో మూసివేసిన రహదార్లు

వరద బీభత్సంతో మూసివేసిన రహదార్లు

ఉత్తరాది రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో గత కొన్నిరోజులుగా కుండపోత వర్షాల కారణంగా నదులు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నదుల ఒడ్డున ఉన్న జనా వాసాలు నీట మునగడంతో ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. వరదల కారణంగా నిన్న ఒక్కరోజే హిమాచల్‌ ప్రదేశ్‌లో పాతిక మంది ప్రాణాలు కోల్పోయారు.

ఉత్తరాఖండ్‌లో వరదకు ఇళ్లు కొట్టుకుపోయి 18మంది గల్లంతయ్యారు. హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో కొండచరియలు విరిగిపడి జాతీయ రహదార్లు, జిల్లా రహదార్లను మూసివేశారు. ఐదో నంబర్‌ జాతీయ రహదారి సహా పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి వాహన రాకపోకలు నిలిచిపోయాయి. కులుమనాలిని కలిపే నేషనల్‌ హైవే పూర్తిగా దెబ్బతినడంతో.. భారీవాహనాల రాకపోకలను నిలిపేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో NDRF, రెడ్‌ క్రాస్‌, ITBP  బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.

ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీ జిల్లాలో ఒక్కసారిగా వరదలు ఉప్పెనలా విరుచుకుపడ్డాయి. ఎగువ ప్రాంతాల్లో విరివిగా కురుస్తున్న వర్షాల కారణంగా యమునా నది ఉపనది టోన్స్‌ ఉప్పొంగి పొర్లుతోంది. నది ఉధృతంగా ప్రవహించడంతో 20 ఇళ్ళతో పాటు 18 మంది నీటిలో కొట్టుకుపోయారు. నదీ తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల్నీ సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వచ్చే 24 గంటల్లో టోన్స్‌ నది కారణంగా యమునా నదిలో నీటిమట్టం పెరిగే అవకాశం ఉంది.