
ముంబై : కరోనా కారణంగా కష్టాలు పడ్డ ఎయిర్‌లైన్స్ క్రూ, పైలెట్లు, ఇతర స్టాఫ్‌కు మంచి రోజులు వచ్చాయి. ఆకాశ ఎయిర్‌ను త్వరలో ప్రారంభించడంతోపాటు, జెట్ ఎయిర్వేస్ తిరిగి రావడం, ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ స్వాధీనం చేసుకోవడంతో వీళ్లకు గిరాకీ పెరిగింది. ఈ మూడు కంపెనీలు వారి ప్రస్తుత ఉద్యోగులను నిలుపుకోవడానికి జీతాలను పెంచుతున్నాయి. పాత ఉద్యోగులకు మళ్లీ ఫోన్లు చేస్తున్నాయి. ఇండియాలో తగినంత మంది దొరక్కపోతే విదేశీ పైలట్లను నియమించుకోవడానికి రెడీ అవుతున్నాయి. “ కొత్త వారికి ట్రైనింగ్ ఇచ్చి డెవెలప్ చేసేంత సమయం ఎయిర్‌లైన్స్ సంస్థలకు లేదు. ఇతర కంపెనీల నుంచి తీసుకోవలసి ఉంటుంది. ఈ విషయంలో పాత కంపెనీలకే ఎదురు దెబ్బ తగులుతుంది. మంచి ట్యాలెంట్ఉన్న వారికి భారీగా ప్రయోజనాలు దక్కుతాయి”అని కన్సల్టింగ్ సంస్థ అయాన్ ఇండియా హ్యూమన్ క్యాపిటల్ బిజినెస్ సీఈఓ నితిన్ సేథి అన్నారు. కంపెనీలు విదేశీ పైలట్లను నియమించుకునే అవకాశాలు ఉన్నాయని, అయితే వారి సంఖ్య 7–-8 సంవత్సరాల క్రితం ఉన్నస్థాయిలో ఉండదని అన్నారు. ఏటీఎఫ్ ధరలు, భారీ జీతభత్యాల కారణంగా విదేశీ పైలెట్ల విషయంలో ఎయిర్‌లైన్స్ ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాయని సేథి చెప్పారు. ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్వేస్ ఆకాశ ఎయిర్ల ఆఫీసులను రోజూ ఇంటర్వ్యూలతో కళకళలాడుతున్నాయి.
అనారోగ్యం కాదు.. ఇంటర్వ్యూ కోసమే సెలవు..
పెద్ద సంఖ్యలో క్యాబిన్ స్టాఫ్ అనారోగ్యంతో సెలవు తీసుకోవడంతో 55 శాతం ఇండిగో దేశీయ విమానాలు శనివారం ఆలస్యం అయ్యాయి. నిజానికి వీరిలో ఎక్కువ మంది ఎయిర్ ఇండియా షెడ్యూల్ చేసిన రిక్రూట్మెంట్ ఇంటర్వ్యూలకు వెళ్లారని వార్తలు వచ్చాయి. “క్యాబిన్, ఫ్లైట్ క్రూ నియామకాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. రాబోయే 1-–2 సంవత్సరాలలో పైలట్లలో చాలా మంది కంపెనీలు మారుతారు. బలహీనమైన ఎయిర్‌లైన్స్ నుండి బలమైన ఎయిర్‌లైన్స్‌కు వెళ్తారు’’ అని ఏవియేషన్ కన్సల్టెన్సీ సీఏపీఏ సీనియర్ ఎగ్జిక్యూటివ్ కపిల్ కౌల్ అన్నారు. కొత్తవాటితోపాటు పాత ఎయిర్‌లైన్స్ సంస్థలు ట్యాలెంట్‌ను ఆకర్షించడానికి రెగ్యులర్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లను నిర్వహిస్తున్నాయి. “ప్రస్తుతం మాకు దాదాపు 400 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. రాబోయే కొన్ని నెలల్లో ప్రతి 30 రోజులు ఒకసారి దాదాపు 175 మందిని చేర్చుకుంటాం" అని ఆకాశ ఎయిర్ సీఈఓ వినయ్ దుబే తెలిపారు. 2023 మార్చి చివరి నాటికి దాదాపు 2,000 మంది ఉద్యోగులతో 18 విమానాలను నడపాలని భావిస్తున్నామని వివరించారు. బిలియనీర్ రాకేష్ జున్‌జున్‌వాలా మద్దతుతో అకాసా ఎయిర్ ఈ నెలాఖరులో షెడ్యూల్డ్ కమర్షియల్ విమానాలను ప్రారంభించనుంది.