
- ఏటూరునాగారంలో 11సెం.మీ, మంగపేటలో 7 సెం.మీ వాన
ములుగు/ మంగపేట, వెలుగు : ములుగు జిల్లాలో భారీ వర్షం కురిసింది. సోమవారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురవడంతో అత్యధిక వర్షపాతం నమోదైంది. మొత్తం 43.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, ఏటూరునాగారంలో అధికంగా 11.4 సెం.మీ, మంగపేటలో 7.2, వెంకటాపురంలో 5.4 సెంటీ మీటర్ల వర్షం నమోదైంది. జిల్లాలో ప్రవహిస్తున్న గోదావరి నదిలో ఎగువ ప్రాంతాల నుంచి వరద తగ్గడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు ఎత్తివేశారు. మంగపేటలోని పలు కాలనీలు నీట మునిగాయి.
మల్లూరు గుట్టపై పడిన వాన నీరు నర్సింహసాగర్ కాలువ నీటితో కలిసి వరద ఉధృతి పెరిగి మండలంలోని రమణక్కపేట, ఓడగూడెం, పాలాయిగూడెం గ్రామాల్లో పలు కాలనీలపై నుంచి ప్రవహించింది. రమణక్కపేటలోని సీఎస్ఐ కాలనీలోని ఇండ్లలోకి నీరు చేరింది. పాత గోడలు నేలకూలాయి. వాజేడు మండంలోని బొగతకు పర్యాటకుల అనుమతి ఉన్నా కొలను నీళ్లలో స్నానాలకు అనుమతివ్వలేదు. వచ్చే రెండు రోజులు సైతం వాతావరణ శాఖ ములుగు జిల్లాకు ఆరెంజ్అలర్ట్ జారీ చేయడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.