ఆదిలాబాద్ జిల్లాలో కుంభవృష్టి.. నాన్ స్టాప్ వర్షానికి జిల్లా అతలాకుతలం.. నిలిచిపోయిన రాకపోకలు

ఆదిలాబాద్ జిల్లాలో కుంభవృష్టి.. నాన్ స్టాప్ వర్షానికి జిల్లా అతలాకుతలం.. నిలిచిపోయిన రాకపోకలు

ఆదిలాబాద్ జిల్లాను వానలు వదలటం లేదు. తెలంగాణ వ్యాప్తంగా కాస్త తెరపిచ్చినప్పటికీ.. జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. సోమవారం (సెప్టెంబర్ 01) కురిసిన వర్షానికి జిల్లా అతలాకుతలం అయ్యింది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 

ఇచ్చోడ, గుడిహత్నూర్, సిరికొండ మండలాలలో కుంభవృష్టి నమోదైంది. సాయంత్రం 5 గంటల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి జిల్లా మొత్తం జలమయం అయ్యింది. సిరికొండ, ఇచ్చోడ, గుడిహత్నూర్  మండలాలలో 5 సెంటిమీటర్లకు మించి వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. 

జిల్లాలో కురుస్తున్న వర్షం ధాటికి వాగులు, వంకలు ఉధ్రుతంగా ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.  లోతట్టు ప్రాంతాలన్నీ  జలమయమయ్యాయి. వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ప్రజలంతా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని.. బయటకు రాకూడదని అధికారులు ఆదేశించారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా వాగుల వద్ద పోలీసులు గస్తీ కాస్తున్నారు. వాహనదారులను వాగు ప్రవహించే రూట్లలో వెళ్లకుండా చూస్తున్నారు.