రాఖీ వేళ ఢిల్లీలో తీవ్ర విషాదం.. వర్షానికి గోడ కూలి ఏడుగురు మృతి

రాఖీ వేళ ఢిల్లీలో తీవ్ర విషాదం.. వర్షానికి గోడ కూలి ఏడుగురు మృతి

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వాన వల్ల రోడ్లు, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. సౌత్ ఈస్ట్ ఢిల్లీ హరినగర్ ఏరియాలోని ఒక పాత గుడి వద్ద గోడ కూలి మీదపడటంతో ఏడుగురు చనిపోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు ఒకే కుటుంబానికి చెందినవారు ఉన్నారు.

మృతులను షబీబుల్(30), రబీబుల్(30), ముత్తు అలీ(45), రుబీనా(25), డాలీ(25), రుక్సానా(6), హసీనా (7)గా గుర్తించామని పోలీసులు వెల్లడించారు. జైత్​పూర్‎లోని హరినగర్ ఏరియాలో ఉన్న మోహన్ బాబా మందిర్ వద్ద గోడ కూలిందని ఉదయం 9 గంటల తర్వాత సమాచారం అందిందని, వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ డిపార్ట్ మెంట్ సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టామన్నారు. 

బాధితులను సఫ్దర్ జంగ్, ఎయిమ్స్ ఆస్పత్రులకు తరలించగా, చికిత్స పొందుతూ ఏడుగురు చనిపోయారని, హషిబుల్(27) అనే వ్యక్తి చికిత్స పొందుతున్నాడని తెలిపారు. గుడి పక్కన ఉన్న పాత మట్టి ఇండ్లలో కొందరు ఉంటున్నారని, వీరిలో ఎక్కువ మంది స్క్రాప్ కొనుగోలుదారులు, బెంగాల్ నుంచి వచ్చిన వలస కార్మికులే ఉన్నారని పోలీసులు చెప్పారు. మున్ముందు మళ్లీ ప్రమాదాలు జరగకుండా ఉండేందుకుగాను ఆ పాత ఇండ్లలో నివసిస్తున్న వాళ్లందరినీ ఖాళీ చేయించామన్నారు.  

ట్రాఫిక్ జాంలతో జనం అవస్థలు.. 

ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి నుంచే వర్షాలు దంచికొట్టాయి. శనివారం ఉదయం నుంచే భారీ వర్షాలు పడ్డాయి. దీంతో రోడ్లు, అండర్ పాస్ లన్నీ చెరువుల్లా మారాయి. అనేక చోట్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయి పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాంలు కావడంతో జనం అవస్థలు పడ్డారు. ఢిల్లీ ఎన్ సీఆర్, పంచకుయన్ మార్గ్, మథుర రోడ్డు, శాస్త్రి భవన్, ఆర్కే పురం, మోతీ బాగ్, కిద్వాయి నగర్, తదితర ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి మొదలైన వర్షం శనివారం ఉదయం వరకూ ఎడతెరిపి లేకుండా కురిసింది.

గడిచిన 24 గంటల్లో సఫ్దర్​జంగ్‎లో 78.7 మిల్లీమీటర్లు, ప్రగతి మైదాన్‎లో100, లోథి రోడ్‎లో 80, పుసాలో 69, పలాంలో 31.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ఐఎండీ వెల్లడించింది. అయితే, వేడి, ఉక్కపోతతో అల్లాడుతున్న ఢిల్లీ ప్రజలకు ఈ వర్షాలు కొంత ఊరటనిచ్చాయి. మరోవైపు, యమునా నది వార్నింగ్ లెవల్‎కు చేరువైంది. శనివారం నాటికి యమునలో నీటి ప్రవాహం 204.50 మీటర్లకు చేరిందని, లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉందని అధికారులు తెలిపారు.

యూపీలో ఇల్లు కూలి తండ్రీకొడుకులు మృతి  

ఉత్తరప్రదేశ్‎లోని చందౌలీలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురవడంతో ఓ మట్టి ఇల్లు కూలిపోయి శివ్ మురత్ (65) అనే వృద్ధుడు, అతడి కొడుకు జైహింద్ (35) చనిపోయారని పోలీసులు వెల్లడించారు. ఇల్లు చాలా పాతది కావడంతో వర్షానికి తడిసి కూలిపోయినట్టు తెలిపారు.

300 విమానాలు ఆలస్యం

భారీ వర్షానికి ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం (ఐజీఐఏ)లో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక్కడి నుంచి రోజుకు సుమారు 1,300 విమానాలు రాకపోకలు సాగిస్తుండగా.. శనివారం మాత్రం 300కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి. మరికొన్ని ఏకంగా రద్దయ్యాయి. ఫ్లైట్ ట్రేడర్ 24. కామ్ వెబ్‌‌సైట్ డేటా ప్రకారం.. విమానాలు బయలుదేరే సమయాల్లో సగటున 17 నిమిషాలు ఆలస్యం నమోదైంది.  ఢిల్లీలో భారీ వర్షం కారణంగా విమాన షెడ్యూళ్లలో తాత్కాలిక అంతరాయం ఏర్పడినట్లు ఇండిగో ఎయిర్‌‌లైన్స్ ట్వీట్ చేసింది.