- కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వడ్లు
- ఎస్సారెస్పీ బ్యాక్వాటర్లో మునిగిన పంటలు
- ఆందోళన చెందుతున్న అన్నదాతలు
నస్రుల్లాబాద్/లింగంపేట/నవీపేట్, వెలుగు : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో శుక్రవారం వర్షం దంచికొట్టింది. వరి నూర్పిళ్లు జోరుగా సాగుతుండగా, ముందుగా వరి కోసిన కొందరు రైతులు కొనుగోలు కేంద్రాలకు వడ్లను తీసుకెళ్లి తేమ శాతం తగ్గేందుకు వారం రోజులుగా ఎండబెట్టారు. ఇంతలోనే భారీ వర్షం కురువడంతో వడ్లు తడిసి ముద్దయ్యాయి. నస్రుల్లాబాద్, బీర్కూర్ మండలాలతోపాటు లింగంపేట మండలంలోని మెంగారం, బోనాల్, శెట్పల్లిసంగారెడ్డి, ఎక్కపల్లి, పర్మల్ల,అయ్యపల్లి, భవానీపేట, జల్దిపల్లి పోతాయిపల్లి, లింగంపల్లి, ముస్తాపూర్ తదితర గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు వర్షం ధాటికి ఆగమాగమయ్యాయి.
ఆరబెట్టిన వడ్లు తడువడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కాంటా పెట్టడంలో నిర్వాహకులు జాప్యం చేస్తుండడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని రైతులు ఆరోపిస్తున్నారు. రహదారుల మీద ఆరబెట్టిన ధాన్యం నీళ్లల్లో కొట్టుకుపోవడంతో గంపల్లో ఎత్తుకుంటూ కన్నీరు పెట్టారు. బీర్కూర్ మండలంతో పాటు నస్రుల్లాబాద్ మండలంలోని దుర్కి, అంకోల్, మైలారం గ్రామాల్లో ఆరబెట్టిన వడ్లు, ధాన్యం కుప్పలు వర్షానికి అతలాకుతలమయ్యాయి.
నవీపేట మండలం లోని నాల్లేశ్వర్ గ్రామంలో ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ వల్ల పంటలు మునిగిపోయాయి. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు గోదావరి పరీవాహక ప్రాంతాల పంటలు నీట మునుగగా, మళ్లీ పంట నీటి పాలైంది. పంటలు మునుగకుండా ఎస్సారెస్పీ ప్రాజెక్ట్గేట్లు ఓపెన్ చేసి దిగువకు నీళ్లు విడుదల చేయాలని రైతులు అధికారులను కోరుతున్నారు.
