చెన్నైని ముంచెత్తిన వాన.. స్కూళ్లు, కాలేజీలు బంద్

చెన్నైని ముంచెత్తిన వాన.. స్కూళ్లు, కాలేజీలు బంద్

చెన్నై: భారీ వర్షాలు చెన్నైని ముంచెత్తాయి. రెండ్రోజులగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సిటీలోని చాలా ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో చెన్నైతోపాటు తిరువళ్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం, శివగంగ జిల్లాల్లో సోమవారం స్కూళ్లు, కాలేజీలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు చెన్నైలో 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చెన్నైలో 2015 తర్వాత ఇంత భారీ స్థాయిలో వర్షం కురవడం ఇదే తొలిసారి అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

ఉత్తర కోస్తా జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో మంగళ, బుధ, గురువారాల్లోనూ ఉత్తర కోస్తా తమిళనాడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని ఇండియన్ మెటిరియోలజికల్ డిపార్ట్​మెంట్(ఐఎండీ) రెడ్ అలర్ట్ జారీ చేసింది. లోతట్టు ప్రాంతాలకు వరదలు రావడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. కొరాటూరు, పెరంబూర్, అన్నా సలాయ్, టీనగర్, అడయార్, పెరుంగుడి ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. అనేక చోట్ల ఇండ్లలోకి భారీగా వరద నీరు చేరింది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా చెంబరబాక్కం రిజర్వాయర్ నిండుకుండలా మారడంతో క్రస్ట్ గేట్లను ఎత్తివేయక తప్పలేదని అధికారులు తెలిపారు. వర్షాల కారణంగా చెన్నైతో పాటు తిరువళ్లూరు, చెంగల్​పట్టు, కాంచీపురం జిల్లాల్లోని స్కూళ్లకు రెండ్రోజులు సెలవు ప్రకటించారు. చెన్నైలోని లోకల్ రైళ్లను ఆదివారం రద్దు చేశారు. 

ముంపు ప్రాంతాల్లో స్టాలిన్ పర్యటన

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అధికారులతో కలిసి ఆదివారం చెన్నైలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఎగ్మోర్, పాడి బ్రిడ్జి, జవహర్​నగర్, కొలత్తూరు, పెరంబూర్, ఒట్టేరి  సహా నీటమునిగిన 14 ప్రాంతాలను ఆయన పరిశీలించారు. టెంపరరీ షెల్టర్లలో ఉన్న ముంపు బాధితులకు బియ్యం, పాలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఇలాంటి సమయంలో ప్రజలకు అవసరమైన అన్ని రకాల సహాయ చర్యలు అందించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సహాయక శిబిరాల్లో కరోనా నిబంధనలు పాటించేలా చూడాలన్నారు. ముంపు బాధితులకు పునరావాసం కల్పించే పనుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొనాలని సీఎం సూచించారు. నాలుగు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఫైర్ సిబ్బంది ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టారని చెప్పారు. 20 సెంటీమీటర్లు అంతకంటే ఎక్కువ వర్షపాతం కారణంగా చెన్నైతో పాటు మరో 11 జిల్లాలపై ఎఫెక్ట్ పడిందన్నారు. గ్రేటర్ చెన్నైలో 160 సహాయ శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. దీపావళి పండుగకు సొంతూర్లకు వెళ్లిన ప్రజలు చెన్నైకి ప్రయాణాలను మూడ్రోజుల పాటు వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సిటీలో వరద బాధితుల సహాయం కోసం 24 గంటల టోల్​ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

మరిన్ని వార్తల కోసం: 

కేంద్రం వడ్లు కొనకుంటే రాష్ట్రం ఏమీ చేయలేదు

‘మా’ అధ్యక్షుడు విష్ణు కూడా స్థానికేతరుడే

వరి వద్దంటే ప్రాజెక్టులెందుకు?