తిరుమలలో భారీ వడగండ్ల వాన.. భక్తులు తీవ్ర అవస్థలు

తిరుమలలో భారీ వడగండ్ల వాన.. భక్తులు తీవ్ర అవస్థలు

తిరుమలలో భారీ వడగండ్ల వాన కురుస్తోంది. ఉదయం నుంచి మద్యాహ్నం వరకు ఎండలు, ఉక్కపోతలు ఉక్కిరిబిక్కిరి చేయగా మద్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.  ఉరుములు మెరుపులతో కూడిన భారీ వడగండ్ల వర్షం కురుస్తోంది.  వర్షం కారణంగా భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. శ్రీవారి  దర్శనానికి వెల్లే భక్తులతో పాటు,  దర్శనానంతరం ఆలయం వెలుపలికి చేరుకున్న భక్తులు వర్షం దాటికి షెడ్ల కిందికి పరుగులు తీశారు. 

చిన్నపిల్లలతో వచ్చిన తల్లిదండ్రులు వర్షం కారణంగా తీవ్రవస్థలు పడ్డారు.  షాపింగ్ కాంప్లెక్స్, లోతట్టు ప్రాంతాలలోని దుఖానాలలోకి వర్షపు నీరు చేరడంతో వస్తువులు తడిసిపోయాయి. ఇక వర్షం కారణంగా మొదటి, రెండో ఘాట్ రోడ్లలో అక్కడక్కడ  కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉందని, దీంతో ద్విచక్ర వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని టీటీడీ  భద్రతా సిబ్బంది సూచనలు చేస్తున్నారు.

మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.  6 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.  టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఇక ఏప్రిల్ 20 గురువారం రోజున  56,680 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 18,947 మంది భక్తులు, తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.54 కోట్లు వచ్చినట్లుగా టీటీడీ వెల్లడించింది.