వికారాబాద్ జిల్లాలో పొంగిన వాగులు, వంకలు

వికారాబాద్ జిల్లాలో పొంగిన వాగులు, వంకలు

వికారాబాద్/కొడంగల్, వెలుగు: మొంథా తుఫాన్ ప్రభావంతో వికారాబాద్ జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేని వర్షం కురిసింది. వాగులు, చెరువులు, ప్రాజెక్టులు పొంగి పొర్లడంతో పలు ప్రాంతాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

భారీ వర్ష సూచనతో కలెక్టర్​జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు బుధవారం సెలవు ప్రకటించారు. సెలవు ప్రకటన రాకముందే స్కూళ్లకు బయలుదేరిన విద్యార్థులు.. ఆ తర్వాత ఇండ్లకు వెళ్లడానికి ఇబ్బంది పడ్డారు. కొడంగల్, బోంరాస్​పేట, దుద్యాల, దౌల్తాబాద్​మండలాల్లోని చెరువులు, కుంటలు అలుగు పారుతున్నాయి. వర్షానికి బోంరాస్​పేట మండలం బురాన్​పూర్​ వద్ద చిన్నవాగు పొంగడంతో అటుగా వెళ్తున్న కారు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. 

గ్రామస్తులు ట్రాక్టర్, తాడు సహాయంతో కారును బయటకు లాగారు. ఎలాంటి ప్రమాదం జరగలేదు. అలాగే వర్షం తాకిడికి కొడంగల్​శివారులో ఎన్​హెచ్​163పై లారీ పక్కకు ఒరిగింది. యాలాల మండలం కాగ్నా నదిలో కొట్టుకుపోతున్న హరి, శ్రవణ్​అనే ఇద్దరు యువకులను అగ్గనూరు గ్రామానికి చెందిన పెద్దింటి నర్సింహులు తాడు సహాయంతో కాపాడారు. చేతికొచ్చిన పత్తి పంట పూర్తిగా పాడైపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు తమ పరిధిలో అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సూచించారు. అలాగే జిల్లా యంత్రాంగాన్ని  కలెక్టర్ ప్రతీక్ జైన్ అలర్ట్​ చేశారు. అత్యవసరం అయితే తప్ప ఇండ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు ప్రజలకు సూచించారు. 

జంట జలాశయాలకు తగ్గని వరద 

పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో సిటీ జంట జలాశయాలకు వరద కొనసాగుతూనే ఉన్నది. ప్రస్తుతం ఉస్మాన్ సాగర్ 7 గేట్లు,  హిమాయత్ సాగర్ నాలుగు గేట్లు మూడు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఉస్మాన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 1,790 అడుగులు కాగా ప్రస్తుతం 1,788.95 అడుగుల మేరకు నీటి నిల్వలు ఉన్నాయి.  

ఇన్​ఫ్లో 3,800 క్యూసెక్కులు ఉండగా, 2,240 క్యూసెక్కుల ఔట్ ఫ్లో కొనసాగుతోంది. హిమాయత్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం 1762.80 అడుగుల నీటి నిల్వలు ఉన్నాయి. 6,400 క్యూసెక్కుల ఇన్ ఫ్లో, 3,963 క్యూసెక్కుల ఔట్ ఫ్లో కొనసాగుతోంది.