వడగండ్ల వర్షం... పూర్తిగా తడిసిన ధాన్యం

వడగండ్ల వర్షం... పూర్తిగా తడిసిన ధాన్యం

జోగులాంబ గద్వాల జిల్లాలో గురువారం సాయంత్రం వాన దంచి కొట్టింది. గద్వాల టౌన్, అలంపూర్ చౌరస్తా, ధరూర్ మండల కేంద్రంతో పాటు పలు ప్రాంతాల్లో వడగండ్ల వాన పడింది. గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డులో దాదాపు 100 క్వింటాళ్లకు పైగా వేరుశనగ తడిసిపోయింది. 70 కింటాళ్ల వరకు పల్లీలు కొట్టుకుపోయి నష్టం వాటిల్లింది. ఆలంపూర్ చౌరస్తాలోని మార్కెట్ యార్డులో పప్పు శనగలు తడిసిపోయాయి. మల్లకల్ మానవపాడు అలంపూర్ మండలాలలోని రైతులు తమ కల్లాల దగ్గర వేసుకున్న ఎండుమిర్చి తడిసింది. బిజినేపల్లి మండలం మహాదేవుని పేట గ్రామంలో సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం పడడంతో ఆరబెట్టిన మక్కలు, ధాన్యం పూర్తిగా తడిశాయి. ఆమనగల్లు పట్టణంలో గురువారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది.  వెంకటేశ్వర కాలనీలో వడగండ్ల వర్షం ఎక్కువగా పడింది. 
గద్వాల, మానవపాడు,కందనూలు అమనగల్లు, వెలుగు


పిడుగు పాటుకు ముగ్గురు బలి.. 

ఉమ్మడిపాలమూరు జిల్లాలో గురువారం పిడుగుపాటుకు ముగ్గురు బలయ్యారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం పెంచికలపాడు గ్రామంలో పిడుగుపాటుతో గొర్రెల కాపరి చనిపోయింది. వనపర్తి మండలం చిట్యాల గ్రామానికి చెందిన వంగూరు బాలయ్య, లక్ష్మి దంపతులు గొర్రెలను మేపేందుకు పెబ్బేరు మండలం పెంచికలపాడు వచ్చారు. కృష్ణా నది ఒడ్డున గొర్రెలను మేపుతుండగా భారీ వర్షం రావడంతో భార్యాభర్తలిద్దరూ దగ్గర్లోని చెట్టు కిందకి వెళ్లారు.చెట్టు మీద పిడుగువేయడంతో లక్ష్మి(50)చనిపోయింది. బాలయ్యతో పాటు దూరంగా ఉన్న వాళ్ల కొడుకు  సందీప్​ బతికిబయటపడ్డారు. జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని గట్టు మండల ఆరగిద్ద గ్రామంలో పిడుగుపాటుతో రైతు చాకలి జయన్న(40) చనిపోయాడు.  గురువారం సాయంత్రం వర్షం వస్తుండడంతో వ్యవసాయ పొలంలో ఉన్న  పొగాకు దోరణాలు వానకు తడవకుండా ఉండేందుకు బరకం కప్పుతుండగా  పిడుగుపడడంతో అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండలం లింగసాయింపల్లిలో పిడుగుపాటుతో బాలకృష్ణ (22) అనే యువకుడు చనిపోయాడు. అన్నతో కలిసి ఊరి శివారులో గొర్రెలు మేపుతుండగా, అకస్మాత్తుగా వర్షం వచ్చింది. దీంతో  చెట్టు కిందికి వెళ్లగా పిడుగు పడటంతో బాలకృష్ణ అక్కడికక్కడే  కన్నుమూశాడు.