
భీమదేవరపల్లి/ శాయంపేట (ఆత్మకూర్)/ ఎల్కతుర్తి, వెలుగు: ఉమ్మడి జిల్లాలో గురువారం రాత్రి కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో ముల్కనూరు చెరువుకు తూము ద్వారా వచ్చే కాలువ బ్రిడ్జి పూర్తిగా కొట్టుకుపోయింది. విశ్వనాథ కాలనీ సమీపంలో దేవాదుల నార్త్ కెనాల్‌కు గండి పడింది. ఆత్మకూర్ మండలంలోని కటాక్షాపూర్ చెరువు మత్తడి దూకడంతో శుక్రవారం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మత్తడి ప్రాంతంలో పెద్దపెద్ద గుంతలు ఉండడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఎల్కతుర్తి మండలంలోని బస్టాండ్ జంక్షన్ జలమయమయ్యింది.
డీసీఎం, టాటా ఏస్ వాహనాలు మురుగు కాల్వ పక్కన బురదలో కూరుకుపోయాయి. బోడికోనికుంట, సీతాపతికుంట, నల్లకుంటతోపాటు పలు కుంటలు, చెరువులు మత్తడి దూకాయి. మండల పరిధిలోఇన గోపాల్‌పూర్‌కు చెందిన గాజుల రాకేశ్ హుజూరాబాద్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా, తాళ్లవాగు ప్రవాహానికి బైక్‌తో సహా బ్రిడ్జి పిల్లర్ల వద్ద చిక్కుకున్నాడు. కాపాడమని అరవడంతో కిషన్‌రావు అనే వ్యక్తి 100కు సమాచారమిచ్చాడు. దీంతో సీఐ రమేశ్, ఎస్సై ప్రవీణ్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని తాళ్ల సాయంతో రాకేశ్‌ను రక్షించారు. వారితోపాటు కానిస్టేబుల్ బక్కయ్య, వికిల్, రాజు ఉన్నారు.