మహారాష్ట్ర, గుజరాత్​లో కుండపోత

మహారాష్ట్ర, గుజరాత్​లో కుండపోత

మహారాష్ట్ర, గుజరాత్​లో కుండపోత

ముంబై : మహారాష్ట్ర, గుజరాత్, హిమాచల్​ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, గోవా, ఉత్తరప్రదేశ్, వెస్ట్​బెంగాల్, కర్నాటకతో పాటు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురుగ్రామ్​లో ఉదయం 6 గంటల నుంచి కురిసిన కుండపోత వర్షానికి ఎక్స్​ప్రెస్​వే సహా 25 ప్రాంతాలు నీట మునిగాయి. ఢిల్లీలో గురువారం ఉదయం కురిసిన వానకు పలు ప్రాంతాల్లో నడుము లోతు నీళ్లు జమయ్యాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఢిల్లీకి భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆరెంజ్‌‌ అలెర్ట్‌‌ జారీ చేసింది. 

మహారాష్ట్రలో ముగ్గురు మృతి 

మహారాష్ట్రలోని ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలకు ముగ్గురు చనిపోయారు. థానే, పాల్ఘర్​లోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. చెట్లు కూలిపోగా, కార్లు వరదకు కొట్టుకుపోయాయి. థానేలోని దివాలో 16 ఏండ్ల బాలుడు, పాల్ఘర్​లో రాంజీ గింబల్ (45) వరదలో కొట్టుకుపోయారు. థానే సిటీలో 20 సెం.మీ. వర్షపాతం రికార్డయ్యింది. భీవండి, కళ్యాణ్, ఉల్లాస్​నగర్ టౌన్​షిప్స్​లో నీళ్లు చేరాయి. ముంబైలో చెట్టు విరిగిపడటంతో ఒకరు చనిపోగా మరొకరికి గాయాలయ్యాయి. ముంబైకి ఎల్లో అలెర్ట్, నాసిక్, పాల్ఘర్, రాయ్​గడ్, థానే, రత్నగిరి, సింధుదుర్గ్​కు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బైకుల్లా ఏరియాలో గుడిసెపై మర్రిచెట్టు పడటంతో రెహ్మాన్ ఖాన్ (22) 
చనిపోయాడు. 

గుజరాత్​లో నలుగురు చిన్నారులు మృతి

గుజరాత్ పంచమహల్ జిల్లాలోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఓ ఫ్యాక్టరీ గోడ కూలి ఐదేండ్లలోపు ఉన్న నలుగురు చిన్నారులు చనిపోయారు. బాధితులు మధ్యప్రదేశ్​లోని థార్ జిల్లాకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. వీరి తల్లిదండ్రులు హలోల్ మండలం చంద్రపురా విలేజ్​లో కెమికల్ ఫ్యాక్టరీ దగ్గర్లో కూలి పని చేసుకుంటూ జీవించేవారు. మూతపడిన కెమికల్ ఫ్యాక్టరీ గోడకు ఆనుకుని టెంట్ వేసుకుని నివాసం ఏర్పాటు చేసుకున్నారు. భారీ వర్షానికి గోడ కూలిపోయింది. దామోర్ (5), అభిషేక్ భురియా (4), గున్​గున్ భురియా (2), ముస్కాన్ భురియా (5) స్పాట్​లోనే చనిపోయారు.

గాయపడిన ఐదుగురిని హలోల్ హాస్పిటల్​కు తరలించారు. వల్సద్, సూరత్, నవ్​సరి, తాపి జిల్లాల్లో మూడు రోజులుగా కుండ పోత వర్షాలు కురుస్తున్నాయి. కాగా, ఉత్తరాఖండ్​ రాష్ట్రంలోని చమోలీ జిల్లా చిన్కా వద్ద కొండ చరియలు విరిగిపడటంతో బద్రినాథ్ నేషనల్ హైవేను అధికారులు మూసివేశారు. రాజస్థాన్​లోని నివాయి, దెచు ప్రాంతాల్లో కూడా కుండపోత వర్షం కురిసింది. ఈ రెండు ప్రాంతాల్లో సుమారు 11 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.