ఎల్లంపల్లికి జలకళ.. నందిమేడారం, గాయత్రి పంప్‌‌‌‌హౌస్‌‌‌‌ల నుంచి నీటి ఎత్తిపోత

ఎల్లంపల్లికి జలకళ.. నందిమేడారం, గాయత్రి పంప్‌‌‌‌హౌస్‌‌‌‌ల నుంచి నీటి ఎత్తిపోత

పెద్దపల్లి/ధర్మారం/రామడుగు, వెలుగు : పెద్దపల్లి జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, ప్రాజెక్ట్‌‌‌‌లు జలకళను సంతరించుకుంటున్నాయి. భారీ వర్షాల కారణంగా వస్తున్న వరదతో ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌‌‌‌లో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌‌‌‌ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 14.06 టీఎంసీల నీరు చేరింది. 

నంది మేడారం, గాయత్రి పంప్‌‌‌‌హౌజ్‌‌‌‌ల నుంచి నీటి విడుదల

గోదావరి పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు పడుతుండడం, కడెం ప్రాజెక్ట్‌‌‌‌ నుంచి నీటిని విడుదల చేస్తుండడంతో ఎల్లంపల్లిలోకి భారీ స్థాయిలో వరద వస్తోంది. దీంతో పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలోని నంది పంపుహౌస్ నుంచి ఎత్తిపోతలను ప్రారంభించారు. మూడు మోటార్లను ఆన్‌‌‌‌ చేసి 9,450 క్యూసెక్కుల నీటిని ఓపెన్ డిలివర్ సిస్టం ద్వారా నంది రిజర్వాయర్‌‌‌‌లోకి పంపింగ్‌‌‌‌ చేస్తున్నారు. 

అక్కడి నుంచి రామడుగు మండలంలోని లక్ష్మీపూర్‌‌‌‌ గాయత్రి పంప్‌‌‌‌హౌస్‌‌‌‌కు తరలిస్తున్నారు. ఇక్కడి నుంచి గ్రావిటీ కెనాల్‌‌‌‌ ద్వారా వరద కాల్వకు, అక్కడి నుంచి మిడ్‌‌‌‌మానేరుకు నీటిని తరలిస్తున్నారు. బుధవారం ఉదయం 7.30 నుంచి సాయంత్రం 5.30 వరకు గాయత్రి పంపుహౌస్‌‌‌‌లోని 1, 2, 4 పంప్‌‌‌‌ల ద్వారా 0.33 టీఎంసీల నీటిని మిడ్‌‌‌‌మానేరుకు తరలించినట్లు డీఈ రాంప్రసాద్‌‌‌‌ తెలిపారు.