
ముషీరాబాద్/గండిపేట, వెలుగు: వర్ష బీభత్సానికి సిటీలోని పలు ప్రాంతాల్లో భారీ నష్టం వాటిల్లింది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ముషీరాబాద్ రాంనగర్ రామాలయం వీధిలో చుక్క కృష్ణ (80) ఇల్లు కూలిపోయింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఇంటి లోపల సామాన్లు ధ్వంసమయ్యాయి. ఇల్లు శిథిలావస్థకు చేరడంతో ఇటీవల జీహెచ్ఎంసీ ప్రమాదకరమని నోటీసు జారీ చేసింది. దీంతో కృష్ణ తన కొడుకు శీనుతో కలిసి సమీపంలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. వర్షంతో ఉన్న ఒక్క ఇల్లు కూలిపోవడంతో కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.
కూలిన శివాలయం గోడమణికొండ మున్సిపాలిటీ పుప్పాలగూడలో శివాలయానికి సంబంధించిన సీసీ వాల్ పక్కనే ఉన్న ఓ ఇంటిపై కూలడంతో.. మట్టి దిబ్బల్లో కూరుకుపోయింది. బాధిత కల్లకుంట్ల సత్తమ్మ కుటుంబ సభ్యులు ప్రమాద సమయంలో అక్కడే ఉన్నప్పటికీ తృటిలో తప్పించుకున్నారు. ఇంట్లోని సామాన్లు, నిత్యావసరాలు ధ్వంసమయ్యాయి. రహమత్ నగర్లో వర్షానికి రోడ్డు కొట్టుకుపోగా, యూసుఫ్ గూడా కేకే టవర్స్ మెయిన్‌రోడ్డుపై భారీ వృక్షం నేలకూలింది.