ఫసల్ బీమా లేదాయే.. పరిహారం రాదాయే..

ఫసల్ బీమా లేదాయే..  పరిహారం రాదాయే..
  •     రెండేండ్లుగా పంటలకు అందని నష్టపరిహారం    
  •     రైతులకు మూడింతలవుతున్న పెట్టుబడి ఖర్చులు
  •     ఇటీవల కురిసిన వర్షాలకు 50వేల ఎకరాల్లో పంట నష్టం
  •     అప్పులు పుట్టక ఆందోళనలో అన్నదాతలు
  •     నిరుటి నుంచి నివేదికలకే పరిమితం

ఆదిలాబాద్, వెలుగు : ప్రతి ఏడాది అధిక వర్షాలు, వరదలతో ఆదిలాబాద్ జిల్లాలో భారీగా పంట నష్టం జరుగుతోంది. అయినప్పటికీ నష్టపరిహారం చెల్లించడంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలేదు. కేంద్ర ప్రభుత్వం అందించే ఫసల్ బీమా పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ఇవ్వక, అటు కేంద్రం నుంచి వచ్చే పరిహారం వర్తించకపోవడంతో పంట దెబ్బతిన్న రైతులు పెట్టుబడి ఖర్చులు కూడా  తిరిగి రాక అప్పులపాలైపోతున్నారు. 

బీమాకు నోచుకోని పంటలు

గతేడాది జరిగిన పంట నష్టంతోపాటు ఈ ఏడాది జరిగిన నష్టానికి సంబంధించిన నివేదికలను అధికారులు పంపుతున్నారే తప్పా ప్రభుత్వం నుంచి మాత్రం నిధులు విడుదల కావడం లేదు. అకాల, అధిక వర్షాలతో రైతులు గత మూడేండ్లుగా నష్టపోతున్నారు. ఫసల్ బీమా పథకం నుంచి ప్రభుత్వం తప్పుకోవడంతో అసలు పంటలకు బీమా అనేదే లేకుండా పోయింది. ఆదిలాబాద్ జిల్లాలో ఈ సీజన్​లో వివిధ రకాల పంటలు 5.50 లక్షల ఎకరాల్లో సాగ

య్యాయి. అయితే, భారీ వర్షాలు, వరదల కారణంగా జిల్లా వ్యాప్తంగా దాదాపు 50 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇందులో అత్యధికంగా 35 వేల ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిన్నది. కొన్ని చేలల్లో ఇసుక మేటలు, వరద నీటితో పంటలు ఎదగలేని స్థితిలో ఉన్నాయి. ముఖ్యంగా పత్తి పంట సాగు రైతులకు సవాలుగా మారింది. జిల్లాలో 80 శాతం పత్తి సాగు చేస్తుండటంతో విత్తనాలు మొదలు కొని, పంట చేతికొచ్చేంత వరకు నష్టాలు చూడాల్సి వస్తోంది. 

మరోసారి పంట వేయలేని దుస్థితి

తాజా వరదల కారణంగా ఒకరానికి రూ.20 వేల నుంచి రూ. 30 వేల వరకు నష్టం జరిగినట్లు రైతులు  చెబుతున్నారు. పూర్తిగా దెబ్బతిన్న పంటకు పరిహారం రాకపోవడంతో ఆ పంట స్థానంలో మరోసారి పంట వేసేందుకు రైతుల వద్ద చిల్లి గవ్వ లేకుండా పోయింది. దీనికి తోడు పెరిగిన విత్తనాలు,  ఇతర ధరల కారణంగా గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పెట్టుబడి ఖర్చు మూడింతలు పెరిగిపోయింది. విత్తనాల దశ మొదలుకొని మొలకెత్తే వరకు సాగు కోసం అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టారు. పత్తి రైతులు ఎకరానికి రూ.25 వేలు ఖర్చు చేయగా.. వరదలతో పంట 

దెబ్బతినడంతో  మళ్లీ పంట కోసం రూ.25 వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. దీంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. అప్పు కోసం నానా అవస్థలు పడుతున్నారు. ఇక మరికొందరు పెట్టుబడి లేదని, నష్టపోయిన పంటల చోట మళ్లీ పంట సాగుచేయలేమని, తమకు చావే శరణ్యమంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మూడెకరాలు మునిగిపోయాయి

ఈ ఏడాది నేను వేసిన మూడు ఎకరాల్లో పత్తి పంట పూర్తిగా మునిగిపోయింది. పత్తి కర్రలు మొత్తం బురదలో కూరుకుపోవడంతో మళ్లీ విత్తనాలు వేయాల్సిన పరిస్థితి ఉంది. ఎకరానికి రూ.20 ‌వేలు ఖర్చు చేసి సాగుచేసిన పంట పరిస్థితి ఇలా మారింది. ఇప్పుడు మళ్లీ సాగు చేయాలంటే అప్పులు పుట్టడం లేదు. ప్రభుత్వమే ఆదుకొని సాయం చేయాలి.

– చంద్రశేఖర్, రైతు, అంకోలి