
- మందమర్రి ఏరియా సింగరేణి ఇన్‌చార్జి జీఎం విజయప్రసాద్
కోల్ బెల్ట్,వెలుగు: ఆగస్టు నెలలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడిందని మందమర్రి ఏరియా ఇన్ చార్జి జీఎం విజయప్రసాద్ అన్నారు. సోమవారం మందమర్రి జీఎం ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏరియా బొగ్గు గనుల్లో సాధించిన ఉత్పత్తి, ఉత్పాదకత వివరాలను వెల్లడించారు. మందమర్రి ఏరియా బొగ్గు గనుల్లో ఆగస్టులో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 2,04,500 టన్నులకు గాను 36 శాతంతో 72,967 టన్నులు సాధించామన్నారు.
కేకే5 గనిలో 61శాతం, కాసీపేట1 గనిలో 56 శాతం, కాసీపేట2 గనిలో 66 శాతం, శాంతిఖని గని 52 శాతం ఉత్పత్తి సాధించిందన్నారు . వర్షం కారణంగా నెల మొత్తం మీద పది నుంచి 15 రోజుల పాటు బొగ్గు ఉత్పత్తికి తీవ్ర విఘాతం కలిగిందన్నారు. ప్రస్తుతం సింగరేణి యాజమాన్యం స్వయంగా 3 శావల్స్,12 డంపర్లతో ఓబీ వెలికితీత చేపట్టిందన్నారు. రామకృష్ణాపూర్ ఓపెన్ కాస్ట్ గని రెండో ఫేజ్‌కు అవసరమైన ఫారెస్ట్ ల్యాండ్ పర్మిషన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఆరేడు నెలల్లో వచ్చే ఛాన్స్ ఉందన్నారు. సమావేశంలో ఐఈడీ ఎస్ఈ కిరణ్ కుమార్ డివైపీఎంలు ఆసిఫ్,బొంగోని శంకర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.