ఢిల్లీ వీధుల్లో నదుల్లా పారుతున్న వరద.. 40 ఏళ్ల రికార్డు బ్రేక్

ఢిల్లీ వీధుల్లో నదుల్లా పారుతున్న వరద..  40 ఏళ్ల రికార్డు బ్రేక్

దేశ రాజధాని ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాలు అక్కడి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వివిధ అవసరాలు, పనుల మీద బయటకి వచ్చే వారి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీధుల్లో వరద నీరు నదులను తలపిస్తోంది. వర్షాలు రాజధాని 41 ఏళ్ల రికార్డుని బద్దలు కొట్టాయి. జులై 9న ఉదయం 8:30 నాటికి గడిచిన 24 గంటల్లో 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది 1982 జులై నాటి రికార్డును బద్దలు కొట్టిందని అధికారులు తెలిపారు.  జులై 10, 2003న 133.4 మి.మీ,  జులై 21, 1958న ఆల్ టైమ్ హై 266.2 మి.మీ.  వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా పార్కులు, అండర్‌పాస్‌లు, మార్కెట్‌లు, ఆసుపత్రి ప్రాంగణాలు  నీట మునిగాయి, రోడ్లపై ట్రాఫిక్​ జామ్​ఏర్పడింది. 

మోకాళ్ల లోతు నీటిలో వెళ్తున్న చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియా లో వైరల్​గా మారాయి. ఇవి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ నగర వీధుల్లో ఎన్​డీఆర్​ఎఫ్ తదితర భద్రత బలగాలు మోహరించి.. రక్షణ చర్యలను పర్యవేక్షిస్తున్నాయి. రాజధానికి వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలెర్ట్​ జారీ చేశారు.  . ఢిల్లీ సహా ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ కి వాతావరణ శాఖ ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది.