జోరుగా వర్షం..  రైతన్నల హర్షం

జోరుగా వర్షం..  రైతన్నల హర్షం
  •     మూడు రోజుల్లోనే కామారెడ్డి జిల్లాలో లోటును పూడ్చిన వానలు
  •     ప్రాజెక్ట్​లు, చెరువుల్లోకి వరద నీరు
  •     పంటలకు ఊపిరి 
  •     తాత్కాలిక రోడ్లు కొట్టుకుపోయి పలుచోట్ల రాకపోకలకు ఇబ్బందులు

కామారెడ్డి, వెలుగు : వానాకాలం మొదలైనప్పటి నుంచి ఆశించిన వానలు లేక దిగులు పడుతున్న రైతులకు మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలు ఉపశమనం కల్పించాయి. విత్తనమేసిననాటి నుంచి వానలు లేక వాడిపోతున్న పంటలకు ఈ జల్లులు ఊపిరిపోశాయి. దీంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభం నుంచి జిల్లాలో 10 మండలాల్లో లోటు, 9 మండలాల్లో సాధారణ ​వర్షపాతం నమోదు కాగా, మూడు రోజుల నుంచి కురుస్తున్న వానలకు ఆ లోటు తీరింది. కంటిన్యూగా కురుస్తున్న వానలతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. కొన్నిచోట్ల తాత్కలికంగా వేసిన రోడ్లు కొట్టుకుపోవడం, వాగులు, వంకలు ప్రవహిస్తుండడంతో రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. 

నాలుగు రోజుల వ్యవధిలోనే కామారెడ్డి జిల్లాలో 143 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది.17న  4.7 మిల్లీమీటర్లు, 18న 35.3 మి.మీ., 19న 52  మి.మీ., 20న  51.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ సీజన్​లో ఇప్పటి వరకు నస్రుల్లాబాద్​ మండలంలో అత్యధికంగా 497 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇది సాధారణం కంటే 69.5 శాతం అధికం. ఆ తర్వాత  బీర్కూర్​మండలంలో 360.7 మి.మీ.(40.8% ఎక్కువ), బాన్సువాడలో 489 మి.మీ.( 41.1 % అధికం), నాగిరెడ్డిపేటలో 487 మి.మీ. (59.4%), గాంధారిలో 463 మి.మీ. (34.4%), సదాశివనగర్​లో 347 మి.మీ.(23.2%), రాజంపేటలో 402 మి.మీ. (44 %),  భిక్కనూరులో 352 మి.మీ.(25.1%), మాచారెడ్డిలో 323 మి.మీ.

(21.9%), బీబీపేటలో 322 మి.మీ.(20.8 %) అధిక వర్షపాతం. మిగతా 14 మండలాల్లో నార్మల్​వర్షపాతం నమోదైంది. ఆలస్యంగానైనా వానలు కురుస్తుండడంతో వ్యవసాయ పనులు ముమ్మరం చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సాగు చేసిన మక్క, పత్తి, సోయా, పప్పు దినుసుల పంటలకు ఈ వానలతో ఊపిరి పోసినట్లయ్యింది.

ప్రాజెక్టుల్లోకి వరద..

వర్షాలతో ప్రాజెక్ట్​లు, చెరువులు, కుంటల్లోకి వదర నీరు చేరుతోంది. గురువారం సాయంత్రానికి నిజాంసాగర్​ ప్రాజెక్ట్​లోకి ఎగువ నుంచి 23,400 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. 1405 అడుగులకు గానూ నీటిమట్టం 1390 అడుగులకు చేరింది. నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్ట్​కు కూడా వరద భారీగానే వస్తోంది. 6,657 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి చేరింది. 1,464 ఫీట్లకు గానూ 1,460 ఫీట్లకు నీటిమట్టం చేరింది.   కల్యాణి ప్రాజెక్టులోకి 550 క్యూసేక్కులు, సింగితం ప్రాజెక్టులోకి 450 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది.     

రాకపోకలకు తిప్పలు..

భారీ వానలకు జిల్లాలోని పలు చోట్ల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. బ్రిడ్జిల నిర్మాణం చేపడుతున్న చోట తాత్కలికంగా వేసిన రోడ్లు కొట్టుకుపోవడం, కొన్ని చోట్ల వాగులు ప్రవహిస్తుండడంతో కాజ్​వేల దగ్గర రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.  తాడ్వాయి మండలం బ్రహ్మణ్​పల్లి- టెక్రియాల్​మధ్య బ్రిడ్జి నిర్మాణం చేపట్టగా తాత్కాలిక రోడ్డు వరదకు కొట్టుకుపోయింది. బ్రహ్మణ్​పల్లి, సంగోజీవాడి, కాలోజీవాడి ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. పిట్లం మండలం తిమ్మానగర్​ సమీపంలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్ద తాత్కలిక రోడ్డు కొట్టుకుపోవడంతో రాకపోకలు స్తంభించాయి.

రాజంపేట మండలం కొండాపూర్​ సమీపంలో వేసిన తాత్కలిక రోడ్డు కొట్టుకుపోయింది. సదాశివనగర్​ మండలం అమర్లబండ చెరువు అలుగు పొంగి వాగు ప్రవహిస్తుండడంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. కామారెడ్డి జిల్లా హాస్పిటల్​ఆవరణలో  వర్షం నీరు చేరింది.

సదాశివనగర్​లో భారీ వర్షం..

బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు సదాశివనగర్​లో భారీ వర్షం కురిసింది.   ఇక్కడ 10 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. గాంధారిలో 9. 5 సెం.మీ., రామారెడ్డిలో 8.5 సెం.మీ., నాగిరెడ్డిపేటలో 8.1 సెం.మీ., కామారెడ్డిలో 7.8 సెం.మీ., తాడ్వాయిలో 7.1 సెం.మీ., రాజంపేటలో 6.9 సెం.మీ., లింగంపేటలో 6.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

నిజామాబాద్​లో ఇలా...

నిజామాబాద్, వెలుగు : జిల్లాలో నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షం గురువారం కాస్త తగ్గుముఖం పట్టింది. మబ్బులు కమ్మిన వాతావరణంతో ముసురు వాన పడింది. నిజామాబాద్​ జిల్లా మొత్తంలో 819 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ఇందల్వాయి మండలంలో 105.6 మి.మీ, ధర్పల్లిలో 76.4, డిచ్​పల్లిలో 62.9, సిరికొండ మండలంలో 57.3 మి.మీల వర్షం కురిసింది. సాలూరాలో తక్కువగా 3.0 మి.మీల వర్షపాతం నమోదైంది. 

24 ఇండ్లకు పాక్షిక నష్టం

ముసురు వానతో జిల్లాలో 24 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. సుమారు 25 ఎకరాల వరి పంట నీట మునిగింది. ప్రజల ఇబ్బందులు తెలుసుకునేందుకు కలెక్టరేట్ లో కంట్రోల్​రూమ్​ఏర్పాటు చేశారు. గురువారం కలెక్టర్​ రాజీవ్​గాంధీ హన్మంతు ఆఫీసర్లతో మీటింగ్​ నిర్వహించి తాజా పరిస్థితులు తెలుసుకున్నారు. గోదావరి నదిలో వరద నీటి ప్రవాహం గంటగంటకూ మారుతోంది. ప్రస్తుతం 59,165 క్యూసెక్కుల నీరు గోదావరి మీదుగా ఎస్పారెస్పీ ప్రాజెక్టులో చేరుతోంది.