ఎడతెరిపి వానలు.. జలదిగ్బంధంలో గ్రామాలు

ఎడతెరిపి వానలు.. జలదిగ్బంధంలో గ్రామాలు

ఓ వైపు భారీ వర్షం.. మరోవైపు రోడ్లపై వరదనీరు.. ఇండ్లలోకి వర్షపు నీరు.. ఈ నేపథ్యంలో అతి భారీ వర్షాలతో తెలంగాణ అతలాకుతలం అయింది. ఎడతెరిపిలేని వర్షాలు బీభత్సం సృష్టించాయి. గ్రామాలన్ని జలదిగ్భంధం అయ్యాయి. భారీ వర్షాలతో పంటలు నీటమునిగాయి.  తెలంగాణలో అన్ని జిల్లాల కంటే అధికంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదు అయింది. 

కామారెడ్డి జిల్లాలోని బిక్నూర్, దోమకొండ, మాచారెడ్డి, గాంధారి, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, లింగంపేట్, బీచ్కుందా, పిట్లం, జుక్కల్, నిజాంసాగర్ మండలాల్లో అర్ధరాత్రి నుంచి బీభత్సమైన వర్షం కురుస్తోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. భారీ వర్షం కారణంగా బిక్కనూర్ జాతీయ రహదారిపై టోల్ ప్లాజా దగ్గర కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వర్షానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని వరి పంటలు నీట మునిగాయి. తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి వాగు పొంగి పొర్లడంతో 5 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని భీమేశ్వర వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. 

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి పెద్దచెరువు అలుగు పారడంతో.. జలకళ సంతరించుకుంది. దీంతో గ్రామస్తులు జలకళను చూసేందుకు తరలివస్తున్నారు.ఈ క్రమంలో స్థానికులు చేపల వేట మొదలుపెట్టారు. 

అటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీగా వర్షం పడుతోంది.  సిరిసిల్ల పట్టణంలో రెండు  రోజులుగా కురుస్తున్న వర్షాలకు శాంతి నగర్, సంజీవయ్య నగర్, అనంత నగర్, అశోక్ నగర్ జలమయమయ్యాయి. శ్రీనగర్ కాలనీలోని ఇండ్లల్లోకి వర్షపు నీరు చేరింది. ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్ లో రెండు రోజుల నుంచి భారీ వర్షం కురుస్తుంది. తంగలపల్లి మండలం నేరెల్లలో 118 మిల్లీ మీటర్లు వర్షం పడింది. వేములవాడ పరిధిలో నాంపల్లిలో 116 మిల్లీ మీటర్లు.. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 104 మీ. మీ. వర్షం కురిసింది. వేములవాడ రూరల్ మండలం మల్లారంలో 95 మిల్లీ మీటర్ల వాన పడింది. 

మరోవైపు మెదక్ జిల్లాలో వర్షం పడుతుంది. వెల్దుర్థిలో భారీ వర్షానికి ఇళ్లలోకి నీరు చేరింది. గ్రామంలో డ్రైనేజీలు బాగలేకపోవడం వల్లే వర్షం నీరంతా ఇళ్లలోకి చేరుతుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

పెద్దపల్లి జిల్లాలో రెండు రోజులుగా ఏకదాటిగా వర్షం కురుస్తోంది. భారీ వర్షాలతో సింగరేణి ఉపరితల బొగ్గు గనులలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. రామగుండం రీజియన్ లోని 4 ఓసిపి లో సుమారు రోజుకు 45 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు చేరుకుంది. ప్రాజెక్ట్ 20 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. 

అటు జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో తెల్లవారుజామున నుంచి భారీ వర్షం పడుతోంది. కోరుట్ల టౌన్ లోని పలు కాలనీలలో వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. కల్లూరు రోడ్ లోని రైల్వే బ్రిడ్జి పై  నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో అధికారులు రహదారిని మూసివేశారు. కల్లూరు- పైడిమడుగు గ్రామాల మధ్య వాగుపై ఉన్న  లో లెవలే బ్రిడ్జిపై వరద కొనసాగుతుంది. 

ఇంకా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉదయం నుండి మోస్తారు వర్షం కురుస్తుంది. అటు జనగామ జిల్లాలో వర్షం కురుస్తుంది.