భారీ వర్షాలతో పొంగి పొర్లుతున్న వాగులు.. నీట మునిగిన పంటలు

భారీ వర్షాలతో పొంగి పొర్లుతున్న వాగులు.. నీట మునిగిన పంటలు

మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వికారాబాద్ జిల్లాలోని చాలా పంటలు నీట మునిగాయి. పత్తి, మొక్క జొన్న, కంది పంటలు వర్షానికి పాడయ్యాయి. నాలుగు రోజుల క్రితం వర్షం కోసం ఎదురు చూసిన రైతన్నలు ఇక చాలు వరుణదేవుడా అని వేడుకునేలా దంచి కొడుతున్నాయి. 

వర్షాలతో నీట మునిగిన పంటలతో రైతులు భారీగా నష్టపోతున్నారు. జిల్లాలోని పరిగి పరిసర ప్రాంతాల వాగులు పొంగి పొర్లుతున్నాయి. పలు వాగులు పంటలను ముంచెత్తాయి. పరిగి పెద్దవాగుకు వరద పెరగడంతో రోడ్డుపై  నుంచి వరద వెళ్తోంది. 

దీంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.  నస్కల్ పెద్ద వాగు పొంగి పొరడంతో పరిగి - వికారాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. 

వర్షాలు స్టార్ట్ అయ్యాయంటే నిత్యం ఇదే పరిస్థితి ఉంటోందని రైతులు వాపోతున్నారు. నస్కల్ మీదుగా పరిగి వికారాబాద్ కి మధ్య రాకపోకలు స్తంభించడంతో రెండు మూడు కిలోమీటర్లు వెళ్లాల్సిన తమ గ్రామాలకు వాగు అడ్డంకి వల్ల 40 కి.మీ. ప్రయాణించాల్సి వస్తోందని అంటున్నారు. బ్రిడ్జీ నిర్మించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.