తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు.. 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణలో  రెండు రోజులు భారీ వర్షాలు.. 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణకు రెండు రోజుల రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణశాఖ. రాష్ట్రంలో టెంపరేచర్లు కూడా తగ్గుముఖం పట్టాయి. అన్ని జిల్లాల్లోనూ 39 డిగ్రీలలోపే టెంపరేచర్లు రికార్డయ్యాయి. రాష్ట్రంలో 2 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం 12 జిల్లాలు, సోమవారం 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. హైదరాబాద్లోనూ రాబోయే రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

జులై నెలలో లానినా ప్రభావంతో భారీగా వర్షాలు కురుస్తాయని చెప్పింది భారత వాతావరణ శాఖ.  ప్రస్తుతం పసిఫిక్లో ఎల్ నినో పరిస్థితులు పోయాయని తెలిపింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు యాక్టివ్ గానే ఉన్నా.. దేశంలో వాటి విస్తరణ నెమ్మదించడంతో వర్షాలు కొన్ని చోట్ల మాత్రమే పడుతున్నాయని చెప్పింది. వారం పాటు స్తబ్దుగా ఉన్న రుతుపవనాలు.. మళ్లీ ఇప్పుడు వేగంగా విస్తరిస్తున్నాయని, అందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. దీంతో సెంట్రల్ ఇండియాను దాటి రుతుపవనాలు విస్తరిస్తున్నాయని ఐఎండీ వెల్లడించింది.

నిన్న రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్, ములుగు మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు పడ్డాయి. ఆదిలాబాద్ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో అతి భారీ వర్షం పడింది. అక్కడ 13.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నల్గొండ జిల్లా గుడాపూర్ లో 4.8, నారాయణపేట జిల్లా కోస్గి లో 4.5, సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో 4.3, మంచిర్యాల జిల్లా దేవులవాడలో 3.3, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కుంచవెల్లి, వాంకిడిల్లో 3.3, ఖమ్మం జిల్లా ప్రకాశ్ నగర్ లో 3.3, రంగారెడ్డి జిల్లా రాయచూరులో 3.2 సెంటమీటీర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మిగతా జిల్లాల్లో 3 సెంటీమీటర్ల కన్నా తక్కువ వర్షం కురిసింది.