హిమాచల్లో వరద..ఆరుగురు గల్లంతు

హిమాచల్లో వరద..ఆరుగురు గల్లంతు
  • హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు.. విరిగిపడ్డ కొండ చరియలు
  • పిడుగులు పడి కొన్ని ఇళ్లు ధ్వంసం
  • సిమ్లాలో ఆరెంజ్ అలెర్ట్ జారీ

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. కులూ జిల్లాలోని మణికర్ణిక వ్యాలీలో వరదలు పోటెత్తాయి. చోజ్ గ్రామంలో పిడుగులు పడి కొన్ని ఇళ్లు ధ్వంసమయ్యాయి. వరద ప్రవాహానికి ఆరుగురు గల్లంతైనట్లు తెలిపారు అధికారులు. వరదలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వరద ఉధృతి వల్ల చోజ్ గ్రామానికి వెళ్లే వంతెన కూడి కొట్టుకుపోయింది. గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న ఏకైక వంతెన ధ్వంసం అయ్యిందని అధికారులకు సమాచారమిచ్చారు స్థానికులు.

దీంతో మలానా, మణికరణ్ గ్రామాలకు మిగతా ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అలాగే హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా శివారులోని ధల్లీ టన్నెల్ దగ్గర కొండచరియలు విరిగి పడ్డాయి. రోడ్డు పక్కన టెంట్లు వేసుకుని నివసిస్తున్న వారిపై కొండ చరియలు విరిగి పడ్డాయి. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.  మరోవైపు సిమ్లాలో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.