ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు

ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకుతోడు ఆకస్మిక వరదలతో జనజీవనం స్తంభించింది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో అనేక చోట్ల ఇండ్లు నీటమునిగాయి. ఊహించని రీతిలో వరద ప్రవాహం పెరిగి ఇండ్లు పేకమేడల్లా కూలిపోయాయి. కాళి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగిపోయాయి. నది పరివాహక ప్రాంతంలోని  ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షాలు, వరదలతో జన జీవనం అతలాకుతలం అవుతుండడంతో అధికారులు ఎన్డీఆర్ఎఫ్ దళాలను రంగంలోకి దించారు. నదీ పరివాహక ప్రాంతాలకుచేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఆకస్మిక వరదల వల్ల ఇప్పటి వరకు భారీ ఆస్తి నష్టమే తప్ప ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 

వరద ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ఉన్నతాధికారులు ఎన్డీఆర్ఎఫ్ దళాలతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మరో 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేస్తూ.. సురక్షిత ప్రాంతాల్లోని సహాయక శిబిరాల్లో తలదాచుకోవాలని, వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు అవసరమైతే తప్ప బయటకు రాకుండా సహాయక శిబిరాల్లోనే ఉండే ప్రయత్నం చేయాలంటూ నిరంతరం సూచనలు చేస్తున్నారు.