దంచికొట్టిన వాన.. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయం

దంచికొట్టిన వాన.. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయం
  • దమ్మపేటలో 12.6 సెం.మీ. వర్షపాతం నమోదు
  • ఉమ్మడి జిల్లాలో ఉప్పొంగిన వాగులు, నిండిన చెరువులు
  • స్టేట్​ హైవేపై నుంచి భారీగా వరద ప్రవాహం
  • వరదలతో రాకపోకలకు అంతరాయం

భద్రాద్రికొత్తగూడెం, నెట్​వర్క్, వెలుగు : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం తెల్లవారుజామున భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో దంచికొట్టిన వానకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. జిల్లాలో అత్యధికంగా దమ్మపేటలో 12.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. చుంచుపల్లి మండలంలో 11.4, లక్ష్మీదేవి పల్లి మండలంలో 10.9, అశ్వరావుపేటలో 10.8, పాల్వంచలో 10.1,  ములకలపల్లిలో 9.9, కొత్తగూడెం, ఇల్లందులలో 9.8, చంద్రుగొండలో 7.1, టేకులపల్లి లో 6.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

ఎటుచూసినా నీళ్లే.. 

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎటు చూసినా నీళ్లే కనిపించాయి. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, చెరువులకు అలుగులతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కొత్తగూడెం నియోజకవర్గం చుంచుపల్లి మండలంలోని విద్యానగర్​ గ్రామపంచాయతీలోని స్టేట్​ హైవేను తెల్లవారు జామున వరద నీరు చుట్టుముట్టింది. భారీ ఎత్తున వరద స్టేట్​ హైవేపై చేరడంతో రాకపోకలను పోలీస్​లు ఆపేశారు. స్టేట్​ హైవేకు ఇరువైపులా పలు షాపుల్లోకి వరద నీరు చేరడంతో  పలువురు వ్యాపారులు ఆందోళనలకు గురయ్యారు. విద్యానగర్​, రాంనగర్, ఎన్​కే నగర్​ గ్రామపంచాయతీల్లో ఇంటిలో నుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. 

చుంచుపల్లి మండలంలోని చింతల చెర్వు ఉప్పొంది ప్రవహించడం, నాలాలు ఆక్రమణలకు గురికావడంతో రోడ్డు, ఇండ్లలోకి వరద నీరు చేరుతోందని స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ఇల్లెందు–కొత్తగూడెం హైవేపై అనిశెట్టిపల్లి సమీపంలోని లోతువాగుపై వరద నీరు పెద్ద ఎత్తున చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఎస్ సీబీ, నెహ్రూనగర్​లలో వరద నీరు ఇండ్లలోకి చేరింది. 

ఇతర ప్రాంతాల్లో... 

ఇల్లెందు పట్టణంలోని ఇల్లెందులపాడు మంచినీటి చెరువుకు పడిన అలుగుతో భారీగా వరద నీరు వాగులోకి వచ్చింది. దీంతో దో నెంబర్​ బస్తీ, సత్యనారాయణపురం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పలు ఇండ్లలోకి వరద నీరు చేరింది. 

గుండాల మండలంలోని ఏడు మెలికల వాగు, కిన్నెరసాని, జల్లేరు వాగులు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. 

జూలూరుపాడు మండలంలో రాత్రి కురిసిన వర్షానికి వాగులు పొంగి పొర్లుతున్నాయి. అనంతారం, కాకర్ల గ్రామాల మధ్యలో పొంగి ప్రవహిస్తున్న వాగుతో రాకపోకలు బంద్ అయ్యాయి. 
చంద్రుగొండ, పోకలగూడెం, బాల్యతండా గ్రామాల మధ్యలో వాగు పొంగి ప్రవహిస్తోంది. 

టేకులపల్లి మండలంలోని ముర్రేడు వాగు, రాళ్లవాగు, పెద్దవాగు, పుణ్యపువాగు, కరిశాలవాగు, తెల్లవాగు, మద్రాసుతండ - కొండంగులబోడు గ్రామాల మధ్య ప్రవహించే వాగులు ఉదృతంగా పొంగి ప్రవహించాయి. మండలంలో పత్తి, మొక్కజొన్న పంటలు వరదలకు నీటిలో మునిగాయి. 

 ములకలపల్లి మండలం పుసగూడెం, మాదారం గ్రామాల్లో వరద వలన నష్టపోయిన పంట పొలాలను, ఇండ్లను సీపీఎం  జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, నాయకులు పరిశీలించారు. నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  అనంతరం చుంచుపల్లి మండలంలో వరద ముంపు ప్రాంతాల్లో సీపీఎం బృందం పర్యటించింది.  ఇక్కడ డ్రైనేజీల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాల వల్లే పలు కాలనీలు, స్టేట్​ హైవే జల దిగ్భంధనలో చిక్కుకుందని మచ్చా వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.  

లక్ష్మీదేవిపల్లి మండలంలో ముర్రెడు ఉధృతికి పంచాయతీ ట్రాక్టర్​ నీటిలో మునిగింది. 

కామేపల్లి మండలంలోని బండిపాడు  సమీపంలో ఉన్న బుగ్గవాగు లో- లెవెల్ బ్రిడ్జి పై నుండి  నీరు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు  పూర్తిగా నిలిచిపోయాయి.  

ఖమ్మం మున్నేరు కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది.