Rain Alert: తెలంగాణలోని ఈ జిల్లాల్లో నాలుగు రోజులు భారీ వర్షాలు

Rain Alert: తెలంగాణలోని ఈ జిల్లాల్లో నాలుగు రోజులు భారీ వర్షాలు

హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాల్లో  నేటి (జూన్ 12) నుంచి రానున్న 4 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాల కదలికలు ప్రస్తుతం చురుకు గానే ఉన్నాయని ఐఎండీ తెలిపింది. ఉత్తరాంధ్ర, కోస్తా సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కిలో మీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొంది.

దీంతో.. తెలంగాణలో భారీ వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం రాత్రి హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వాన దంచికొట్టింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి పరిధిలో అత్యధికంగా 14.83 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లింగంపల్లిలో 11.40 సెంటీమీటర్లు, నల్గొండలో 9.1, నాగర్ కర్నూల్లో 8.6, వనపర్తిలో 8.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట మరియు జోగులాంబ గద్వాల్ జిల్లాలలో ఇవాళ (జూన్ 12) అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

ఈరోజు.. ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 40-50 కి.మీ)తో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. నిర్మల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో శుక్రవారం అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.